Last Updated:

Minister Nara Lokesh: అబద్దాల్లో పీహెచ్‌డీ.. వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్

Minister Nara Lokesh: అబద్దాల్లో పీహెచ్‌డీ.. వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్

Minister Nara Lokesh Sensational Comments on Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. వాస్తవాలు చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం మీుకు ఏమైనా ఉందా జగన్ రెడ్డి గారు? అంటూ ప్రశ్నించారు. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నారంటూ చురకలంటించారు.

లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది..
మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి బయటకు రావాలని సూచించారు. 100 మందికిపైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని గుర్తుచేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్‌రెడ్డి అంటూ ఆయనకు గుర్తుచేశారు. అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందంటూ మంత్రి పేర్కొన్నారు.

వీడియోలు ప్లే చేసి చూసుకో..
హోం శాఖ మంత్రి అనిత మంగళవారం అమరావతిలో స్పందిస్తూ బూతులేంటో తెలియాలంటే ఆర్కే రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, పేర్ని నాని, గోరంట్ల మాధవ్‌ వీడియోలు ప్లే చేసి చూసుకోవాలంటూ జగన్‌కు సూచించారు. నేరస్తుడైన పులివెందుల ఎమ్మెల్యే మరో నేరస్తుడిని సబ్ జైల్‌లో కలిసి కట్టుకథలు బాగా అల్లాడంటూ వ్యంగ్యంగా అన్నారు. అబద్ధాల కథలు అల్లటంలో తనకు తానే సాటి అని మరో సారి జగన్ రుజువు చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు.

ఎలాంటి కథలైనా అల్లేస్తాడు..
దళితులంటే వైసీపీ నేతలకు ఎందుకంత చులకన? అంటూ మంత్రి అనిత ప్రశ్నించారు. ఎస్సీ అయితే తనకు లొంగాల్సిందే అనే అహంకార ధోరణా? అని ఆమె ప్రశ్నించారు. నాలుగు కాగితాలు, మరో నాలుగు మైకులు ముందుంటే ఎలాంటి కథలైనా జగన్ అల్లేస్తాడన్నారు. పోలీసులను తొత్తులుగా వాడుకుని నిరాధారమైన కేసులు పెట్టి నాడు జగన్ ఎందరో నిరపరాధుల్ని జైల్లో పెట్టించాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కార్యకర్తల్ని బుజ్జగించుకుంటున్నాం..
అరెస్టుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఫిర్యాదుదారుడు సైతం ఉన్నాడని వివరించారు. మేం కక్షసాధింపులకు పాల్పడాలనుకుంటే, ఎనిమిది నెలల్లో ఎవ్వరూ బయట తిరిగే వారు కూడా కాదన్నారు. కక్ష సాధింపులు వద్దని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తమ కార్యకర్తల్ని బుజ్జగించుకుంటున్నామని తెలిపారు. బట్టలూడతీసి జగన్ కొడతామంటున్నారని.. మరి గతేడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు అదే పని.. చేసి చూపింది సరిపోలేదా? అని అంటూ ఎద్దేవా చేశారు.