Telangana Ministers: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు..
సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం తొలిసారి సచివాలయానికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు సచివాలయం చేరుకున్నారు. రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పండితుల ఆశీర్వచనం అందించారు.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ ప్రారంభమయింది.
Telangana Ministers: సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం తొలిసారి సచివాలయానికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు సచివాలయం చేరుకున్నారు. రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పండితుల ఆశీర్వచనం అందించారు..సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ ప్రారంభమయింది.
శాఖల కేటాయింపు..(Telangana Ministers)
ఈ సమావేశానికి 11 మంది మంత్రులు హాజరయ్యారు. రేపటి నుండి ప్రజా దర్బార్ ఏర్పాటు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్చ జరగనుంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లనున్నారు.మరోవైపు తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు.
భట్టి విక్రమార్క- రెవెన్యూశాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్‌రెడ్డి- హోం మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్ శాఖ మంత్రి
డి.శ్రీధర్‌బాబు-ఆర్థికశాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-నీటి పారుదలశాఖ మంత్రి
కొండా సురేఖ-మహిళా సంక్షేమశాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు- పౌరసరఫరాలశాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్- బీసీ సంక్షేమశాఖ మంత్రి
సీతక్క- గిరిజన సంక్షేమశాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ మంత్రి
ప్రముఖుల అభినందనలు..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సందర్బంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి సర్కార్‌కి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో మోదీ సందేశాన్ని పంపించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలంటూ మోదీ ట్వీట్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నానని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రం మీ నాయకత్వంలో మరింత అభివృద్ధిని సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. డిప్యుటీ సిఎం భట్టి విక్రమార్కతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ శాసన సభాపక్షానికి కూడా చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు అన్నారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని గుర్తుచేశారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా ఆయన అభినందనలు తెలిపారు. తన పదవీకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి ఎపి సిఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలని జగన్ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యుటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదర భావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్కకి, మంత్రులుగా ప్రమాణం చేసిన అందరికీ హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.