Janasena Party: జనసేన అధినేత కీలక నిర్ణయం.. 3 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు
Pawan Kalyan Key Decision in Jana Sena Foundation Day: తెలుగునేలపై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిచిన జనసేన పార్టీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానంటూ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించిన ఆ పార్టీ అధినేత.. ఆ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటూ ప్రధాని మోదీకి అండగా నిలిచారు. ఆ తర్వాతి ఎన్నికలలో పరాజయం పలకరించినా, కుంగిపోకుండా, తాను నమ్మిన విలువల కోసం నిలబడి, అనేక ఆటుపోట్లు, ఒత్తిళ్ల మధ్య పార్టీని నిలబెట్టుకుంటూనే వచ్చారు. 2024 ఎన్నికల నాటికి ఏపీలో నిరాశకు లోనైన విపక్షాలను ఒక్కటి చేసి.. కూటమిగా నిలిపి ఎన్నికలకు పోయి ఎవరూ ఊహించని విజయాలను అందుకుని, ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగానే గాక కీలక విధానకర్తగా చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీని బలోపేతం చేయటంతో బాటు పార్టీ భావజాలాన్ని చివరి మనిషి వరకు చేర్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని జనసేనాని నిర్ణయించారు.
కోర్ కమిటీ భేటీ..
ఈ క్రమంలోనే శుక్రవారం పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 12,13,14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించాలన్న జనసేనాని నిర్ణయాన్ని మంత్రి కోర్ కమిటీలోని కీలక నేతలకు వెల్లడించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ ఆశయాలు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేరాలి? రాబోయే రోజుల్లో పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి? వంటి అంశాలను ప్లీనరీకి హాజరయ్యే నేతలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుని, పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని మంత్రి ప్రకటించారు.
14న భారీ బహిరంగ సభ
ప్లీనరీ సమావేశాలలో భాగంగా… 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం, 13న పలు తీర్మానాలను ప్రవేశపెట్టటం, 14వ తేదీన బహిరంగ సభ ఉంటుందని మంత్రి ప్రకటించారు. ఈ మూడు రోజులు వివిధ అంశాలపై చేపట్టే చర్చాగోష్టులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, లోకం మాధవి, అరవ శ్రీదర్, బొలిశెట్టి శ్రీవివాస్, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, పార్టీ నేతలు మహేందర్‌రెడ్డి, శంకర్ గౌడ్, కోన తాతారావు, కల్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.