AP Deputy CM Pawan Kalyan: వైసీపీ హయాంలో పంచాయితీల నిర్వీర్యం.. గ్రామాల నిధులను దారిమళ్లించారు
![AP Deputy CM Pawan Kalyan: వైసీపీ హయాంలో పంచాయితీల నిర్వీర్యం.. గ్రామాల నిధులను దారిమళ్లించారు](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/AP-Deputy-CM-Pawan-Kalyan-praised-Vissa-Koderu-village.webp)
AP Deputy CM Pawan Kalyan praised Vissa Koderu village: గ్రామాలు స్వయం పోషకాలుగా మారితే.. స్వయం పాలన సాధ్యమవుతుందని, దీనివల్ల తమ గ్రామ అవసరాలను ఆయా గ్రామాలే తీర్చుకోగలుగుతాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని విస్సా కోడేరు గ్రామ ప్రజలను ప్రశంసిస్తూ.. ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కూటమి సర్కారు వచ్చాకే.. పంచాయితీల్లో ప్రక్షాళన ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు.
ఐదేళ్లూ అధోగతే..
గత వైసీపీ పాలనలో ఏపీలోని స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పంచాయితీల మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దారి మళ్లించిందని ఆయన మండిపడ్డారు. ఆ నిర్ణయంలో రాష్ట్రంలోని పంచాయితీలు కనీస సౌకర్యాలకు నోచుకోలేక జనం నానా తిప్పలూ పడ్డారని గుర్తుచేశారు.
స్వయం పాలనే లక్ష్యం..
గ్రామ అవసరాలు, అక్కడి సమస్యల గురించి అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి చర్చించుకుని తమకు కావాల్సిన నిర్ణయాలు తీసుకోవటమే స్థానిక స్వయం పరిపాలన అని, అప్పుడే గ్రామాలలో మౌలిక సదుపాయాలకు లోటు ఉండదని పవన్ వ్యాఖ్యానించారు. గ్రామంలోని అన్ని వర్గాలకు నిర్ణయాలు తీసుకోవటంలో భాగస్వామ్యం, పంచాయితీ పనితీరు విశ్లేషణలో అవకాశం కల్పించటం, స్థానిక వనరులను సమర్థించుకునే దిశగా పంచాయితీలు నిర్ణయం తీసుకోవటం, గ్రామాలకు అవసరమైన వస్తు సేవలను అక్కడే ఏర్పడే దిశగా గ్రామాలు ముందడుగు వేయటమే స్వయంపాలన అని వివరించారు.
కూటమి వచ్చాకే మార్పు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని పవన్ చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం.. 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేసిందని, ఆ నిధులను నేడు గ్రామాలు తమ అవసరాలకు వాడుకోగలుగుతున్నాయని పవన్ తెలిపారు.
విస్సా కోడేరు.. స్ఫూర్తితో
ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా విస్సా కోడేరు గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తమ గ్రామానికి వచ్చిన రూ.10 లక్షలతో రెండు ఫిల్టర్ బెడ్లు, నిరుపయోగంగా ఉన్న నీటిశుద్ధి కేంద్రాన్ని గ్రామస్థులే మరమ్మతు చేసుకున్నారని, అలాగే నూతన పైప్ లైన్లు వేయడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కారం చూపుకున్నారని ప్రశంసించారు. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు పంచాయతీని, గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పవన్ చెప్పారు. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించి, తమవంతుగా గ్రామస్తులకు అండగా నిలిచిన జిల్లా పంచాయతీ రాజ్, నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు చెబుతున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలియజేశారు.