Last Updated:

Pawan Kalyan: ఆధారం లేని వార్తలపై మాట్లాడొద్దు..పార్టీ శ్రేణులకు జనసేనాని లేఖ

Pawan Kalyan: ఆధారం లేని వార్తలపై మాట్లాడొద్దు..పార్టీ శ్రేణులకు జనసేనాని లేఖ

Pawan Kalyan open letter to Janasena Cadre: జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని తెలిపారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున కూడా స్పందించవద్దని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

అది ప్రజావ్యతిరేకత కూడా..
గత ఎన్నికల్లో తమ కూటమి గెలుపుకు కేవలం మూడు పార్టీల పాత్రతో బాటు గత ఐదేళ్లలో వైసీపీ చేసిన అరాచకాల పట్ల ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకత కూడా కారణమేనని ఆ లేఖలో పవన్ అభిప్రాయపడ్డారు. వైసీపీ అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు, వ్యవహార శైలిపై ప్రజలు తీవ్రంగా విసుగు చెందారని అన్నారు. ఏపీలో శాంతి భద్రతలను గాలికొదిలేసి, అరాచకత్వంలో పాలించి, రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేశారని ఆ లేఖలో మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంతో వారు ఏపీని.. రుణాంధ్రప్రదేశ్‌గా మార్చటం పట్ల విసిగిపోయిన జనం.. సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కూటమి సర్కారుకు పట్టంగట్టారని పవన్ గుర్తుచేశారు. అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామని పవన్ కల్యాణ్ అన్నారు.

బాధ్యతగా ఉండాలి..
కూటమిపై నమ్మకంతో 175కి 154 సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారని, జనసేన వందశాతం స్ట్రైక్ రేట్‌తో 21కి 21 అసెంబ్లీ సీట్లు, రెంటింకి రెండు లోక్‌సభ సీట్లు గెలిచిందని తెలిపారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రధాని మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, కూటమిలోని నేతల సమన్వయంతో రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నామని చెప్పారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలుపుకుని, యువతకు మంచి భవిష్యత్ అందించటమే కూటమి లక్ష్యమని అన్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీల శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాలని చెప్పారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం
తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని అన్నారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటమేనని చెప్పారు. తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమేనని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున కూడా జనసేన నేతలు స్పందించటం గానీ, బహిరంగంగా ప్రకటనలు చేయటం కానీ చేయవద్దని జనసేనాని ఆదేశించారు. ఎంతో బాధ్యతగా ఐదుకోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేశారు. మార్చ్ 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.