Minor Rape Case : ఏలూరు జిల్లాలో ఐదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. బాలిక అన్నే మెయిన్ నిందితుడు
మహిళలకు, బాలికలకు బయటి వారి నుంచే కాదు.. కుటుంబ సభ్యుల నుంచి కూడా రక్షణ దొరకడం కష్టం అయ్యింది. ఈ తరహా ఘటనల గురించి వార్తలు రాస్తూనే ఉంటున్నాం.. చర్యలు తీసుకుంటూనే ఉంటున్నారు కానీ ఈ ఘటనలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. రాను రాను ఆడపిల్లని కనాలంటేనే భయపడాలేమో అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి.
Minor Rape Case : మహిళలకు, బాలికలకు బయటి వారి నుంచే కాదు.. కుటుంబ సభ్యుల నుంచి కూడా రక్షణ దొరకడం కష్టం అయ్యింది. ఈ తరహా ఘటనల గురించి వార్తలు రాస్తూనే ఉంటున్నాం.. చర్యలు తీసుకుంటూనే ఉంటున్నారు కానీ ఈ ఘటనలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. రాను రాను ఆడపిల్లని కనాలంటేనే భయపడాలేమో అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు చదవబోయే ఈ విషయం కూడా ఆ కోవలోకే చెందుతుంది. వావి వరుసలు మర్చిపోయి అన్న వరుస అయ్యే వాడు.. పెద్ద వయసులో ఉండి బుద్ది చెప్పాల్సిన మరో వ్యక్తి.. సిగ్గు లేకుండా.. అమానుషంగా ప్రవర్తించిన తీరు అందరితో ఛీ అనిపిస్తుంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఏపీ లోని ఏలూరు జిల్లా మండవల్లిలో బీసీ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.. 4 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. నిందితుల్లో బాలిక అన్నయ్య (పెద్దమ్మ కొడుకు రాంబాబు) కూడా ఉండడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. మరో నిందితుడు మైనర్ కాగా.. బాలిక చదువుకునే స్కూల్‌లోనే 7వ తరగతిలో ఉన్నాడు. మరో వ్యక్తి మండవల్లి మండలం భైరవపట్నంకి చెందిన లారీ డ్రైవర్ ఖాదర్ గా గుర్తించారు.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉండగా.. ప్రధాన నిందితుడైన బాలిక అన్నయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
చేపల చెరువుల వద్ద కాపాల ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన చిన్నారి సమీపంలో ఉన్న హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. అయితే ఆ బాలికకు అన్న వరసయ్యే వ్యక్తికి ఆమె బాధ్యతలు అప్పగించారు. అన్న వరసైన వ్యక్తి తరచూ బాలికను తాను ఉంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లేవాడు. తీసుకెళ్లేది అన్నే కదా అని హాస్టల్ వాళ్లు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇలా ఆమెను తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోనే కుంగిపోయిందా బాలిక. కొన్ని రోజుల తర్వాత వారి వ్యవహారాన్ని ఆ ఇంటి యజమానికి తెలిసింది. అతను తన స్నేహితులు వద్ద ప్రస్తావించాడు. అతని స్నేహితుల్లో ఒకడైన ఖాదర్ కూడా ఈ తప్పులో భాగమయ్యాడు. చివరికి వారి ఇద్దరికీ ఇంటి యజమాని 13 ఏళ్ల కుమారుడు కూడా తోడయ్యాడు.
ఇక ఇటీవల బాలికకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. తల్లిదండ్రులకు కబురు పెట్టారు. అయితే అంతకు ముందు వాళ్లు రాంబాబుకు చెప్పారు. బాలికను తీసుకురావడానికి అతను హాస్టల్‌కు వచ్చాడు. ఆయన్ని చూసిన బాలిక వెళ్లేందుకు ఒప్పుకోలేదు. హాస్టల్ సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. దీంతో ఏదో జరిగిందని గ్రహించిన హాస్టల్ సిబ్బంది నిలదీశారు. హాస్టల్ సిబ్బంది గట్టిగా అడిగేసరికి బాలిక జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. దీంతో ఈ కేసులో నిందితులైన ఖాదర్, ఇంటి యజమాని కుమారుడు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు రాంబాబు విశాఖ పారిపోతుండగా పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. రాజమండ్రి సమీపంలో అతన్ని అరెస్టు చేశారు. వీళ్లందరిపైనా పోక్సో కేసు నమోదు చేసి అదుపు లోకి తీసుకున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.