AP: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు – అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం

Pawan Kalyan Review Meeting Officials: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, ప్రతి దశలోనూ నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో కమిషనర్ కృష్ణతేజ, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నంచి ఉపాధి హామితో పాటు, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేయాలని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలుతనిఖీ చేయాలన్నారు. పనులు ఏ దశంలో ఉన్నాయో ప్రజలకు తెలిజేస్తూ పారదర్శకతతో ఉండాలని చెప్పారు. గత ప్రభుత్వ పాలకుల మాదిరి పంచాయతీలకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టడం లేదని ప్రజలకు తెలపాలన్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభల నిర్వహన, పల్లె పండుగల కార్యక్రమాలు ద్వారా పనులు ప్రారంభం జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ఉండాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.