Aarogyasri Services: తెలుగు రాష్ట్రాల్లో ఆగిన ఆరోగ్యశ్రీ సేవలు.. అత్యవసర వైద్యం కోసం పేదల తిప్పలు
Aarogyasri Services Stopped In Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల్ని బీమా పరిధిలోకి తీసుకురావటం, తమకు చెల్లించాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిల చెల్లింపులు జరగకపోవటంతో ఇక.. వైద్యం అందించలేమంటూ నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఇటు.. తెలంగాణలోనూ రూ. 1000 కోట్ల పెండింగ్ బిల్లుల అంశం కారణంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. అయితే, ఇదే అదనుగా కొన్ని ఆస్పత్రులు నిస్సహాయ స్థితిలో ఉన్న రోగుల్ని పిండుకోవడం మొదలుపెట్టాయి. చికిత్సల అవసరం, బంధువుల ఆందోళనను క్యాష్ చేసుకుంటున్నాయి.
ఏపీలో రోగుల తిప్పలు
ఏపీలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.3వేల కోట్లకు చేరడంతో అందులో రూ.500 కోట్లు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది నెరవేరలేదు. దీంతో జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేశారు. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయి 13 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం కరువైంది. దీంతో గత పది రోజులుగా నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ అత్యవసర సేవలు మినహా అన్ని రకాల వైద్య సేవలనూ నిలిపివేశాయి. కొన్ని చోట్ల డయాలసిస్ సేవల్ని కూడా సొంత ఖర్చులపై అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఆరోగ్యశ్రీ కౌంటర్లను మూసివేయటంతో అత్యవసర వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలోనూ అదే సీన్..
ఇటు.. తెలంగాణలోనూ సుమారు రూ. 1000 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిల అంశాన్ని ప్రస్తావిస్తూ, జనవరి 10 నాటికి చెల్లింపులు చేయాలని గతంలో ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీనికి స్పందించిన సర్కారు.. రూ.120 కోట్ల వరకు పెండింగ్ బకాయిలను చెల్లించింది. అయితే ఏడాది కాలంగా ఉన్న పెండింగ్ బకాయిల్లో కేవలం 45 రోజుల బకాయిలే చెల్లించారని, మిగిలిన వాటిని కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో జనవరి 10 నుంచే సేవలు నిలిచిపోయాయి.
ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీ
రెండు రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవటంతో రోగుల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, గుండె జబ్బులు, డయాలసిస్ రోగులు ఆరోగ్య శ్రీ సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ తొలగించేందుకు వైద్య పరీక్షలకు రూ.25వేలు, శస్త్ర చికిత్సకు రూ.70వేలు ఖర్చవుతుందని చెప్పిన వైద్యులు తర్వాత మరో రూ.75వేలు అదనంగా వసూలు చేసినట్టు రోగి కుటుంబ సభ్యులు ‘కిరణం టీమ్’ముందు వాపోయారు. మరోవైపు, ఇలాంటి మోసాలపై సదరు ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదు చేసే యంత్రాంగం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఇకనైనా ప్రభుత్వాలు రంగంలోకి దిగి ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.