Donald Trump: విదేశాలపై ట్రంప్ సుంకాలు.. షాక్ ఇచ్చిన యూఎస్ ట్రేడ్ కోర్ట్

US Court: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు. అయితే ఈ సుంకాల విషయంలో ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్ లు విధించే అధికారాలు ట్రంప్ కు లేవని యూఎస్ ట్రేడ్ కోర్టు తేల్చి చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సమయంలో భారత్- పాక్ ఉద్రిక్తతల అంశాన్ని ట్రంప్ సర్కార్ ప్రస్తావించగా.. కోర్టు తోసిపుచ్చింది.
అయితే అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్థించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూఎస్ కోర్టును అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్- పాక్ ఘర్షణలను పెంచుతుందని వాదించారు. టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరగుతున్నాయని ట్రంప్ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్ ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదనను కోర్టు తిరస్కరించింది.