Lady Suicide in Visakhapatnam: విశాఖ జిల్లాలో కొడుకు, కూతురితో బావిలో దూకిన మహిళ!

Lady Jump into Well with Children in Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తిలో తీవ్ర విషాద ఘటన జరిగింది. సత్యవాణిపాలెం గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ.. కూతురు, కుమారుడితో కలిసి బావిలో దూకింది. ఘటనలో తల్లి, కుమారుడు మృతిచెందారు. కుమార్తె ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవాణిపాలెం గ్రామానికి చెందిన కొల్లు పవన్, గీత భార్యభర్తలు. వీరికి మణికంఠ (7), మోక్షశ్రీ (9) ఉన్నారు. కాగా పవన్ మద్యానికి బానిస కావడంతో.. గీతతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గీత తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి అనంతరం ఆమె కూడా దూకింది. ఈ ఘటనలో గీత, మణికంఠ మృతిచెందారు. మోక్షశ్రీ బావిలో మెట్టును పట్టుకుని ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తులు మోక్షశ్రీ కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్ తరలించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణం అని స్థానికులు అంటున్నారు.