Mass Shooting at USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

Mass Shooting at USA New Mexico park 3 Dead: అమెరికాలో మరోసారి కాల్పుల మోత రేగింది. న్యూ మెక్సికోలో జరిగిన ఓ కారు ప్రదర్శనలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్త పెద్దదిగా మారడంతో పరస్పరం రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఈ కాల్పులతో కారు ప్రదర్శనకు చూసేందుకు వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు.
న్యూ మెక్సికోలోని లాస్ క్రూస్‌లో అమెరికా కాలమానం ప్రకారం.. రాత్రి 10 గంటలకు రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులు ముగ్గురు మరణించగా.. అందులో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు. ఇక, గాయపడిన వారిలో ఎక్కువగా 16 నుంచి 36 ఏల్ వయసు వారు ఉన్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, గాయపడిన వారిలో ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారని, మరో నలుగురిని చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు అగ్నిమాపక అధికారి మైఖేల్ డేనియల్స్ తెలిపారు. లాస్ క్రూస్‌లో ఉన్న యంగ్ పార్క్‌లో కార్ షోలు నిర్వహించగా.. దాదాపు 200 మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేశారు.
అయితే ఈ ప్రాంతంలో కారు ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదని లాస్ క్రూస్ పోలీస్ చీఫ్ జెరేమీ స్టోరీ తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టామని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.