Last Updated:

Heavy rains hit Pakistan: భారీ వర్షాలతో పాకిస్తాన్ అతలాకుతలం

భారీ వర్షాలకు పాకిస్థాన్‌ అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్‌ ప్రభుత్వం గురువారం నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది.

Heavy rains hit Pakistan: భారీ వర్షాలతో పాకిస్తాన్ అతలాకుతలం

Heavy rains hit Pakistan: భారీ వర్షాలకు పాకిస్థాన్‌ అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్‌ ప్రభుత్వం గురువారం నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. అత్యధికంగా సింధ్‌ ప్రావిన్స్లో 306 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్‌లో 234 మరణాలు నమోదయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 185, పంజాబ్ ప్రావిన్స్‌లో 165 మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పాకిస్థాన్‌లో ప్రతి ఏటా ఆగస్టులో సాధారణ వర్షపాతం 48 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది దాదాపు 241 శాతం అధికంగా 166.8 మిల్లీమీటర్లు నమోదైంది. వరదలతో అస్తవ్యస్తమైన సింధ్‌, బలూచిస్థాన్‌లలో ఏకంగా 784 శాతం, 496 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అసాధారణ వర్షాలు ఆకస్మిక వరదలకు కారణమయ్యాయని పాక్‌ వాతావరణ మార్పులశాఖ మంత్రి షెర్రీ రెహమాన్‌ వెల్లడించారు. వరద పరిస్థితులపై గురువారం ఆమె సమీక్ష జరిపారు.. సహాయక చర్యల సమన్వయానికి ఎన్‌డీఎంఏలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ‘వార్ రూమ్’ని ఏర్పాటు చేశారని చెప్పారు. 2010 నాటి వరదలతో పోలిస్తే.. దేశంలో ప్రస్తుత పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయన్నారు.

‘భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఎడతెగని వర్షాలతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి’ అని షెర్రీ రెహమాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు అంతర్జాతీయంగా దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒక్క సింధ్ ప్రావిన్స్‌లోనే ప్రజలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు పది లక్షల టెంట్‌లు అవసరం. అదే బలూచిస్థాన్‌లో లక్ష కావాలి. ఈ క్రమంలోనే వాటి సమీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి: