కైకాల సత్యనారాయణ: కేజీఎఫ్ హీరో యశ్ ఫ్యూచర్ ఏంటో నాలుగేళ్ల కిందటే చెప్పిన కైకాల సత్యనారాయణ.. ఏమన్నారంటే?
నవరస నటనాసార్వభౌముడిగా ఎన్నో వందల సినిమాలతో ప్రజలను మెప్పించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. కేజీఎఫ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఆ చిత్ర బృందం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణ పాల్గొని.. హీరో యశ్ గురించి ప్రస్థావించారు.
Kaikala Satyanarayana: నవరస నటనాసార్వభౌముడిగా ఎన్నో వందల సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి తనకంటూ సుస్థిరస్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో సినీలోకం మూగబోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి అశ్రు నివాళులర్పిస్తున్నారు. సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిద్యభరిత పాత్రలతో దాదాపు 777 పైగా సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి ప్రజల విశేష మన్ననలను పొందారు.
నటుడిగానే కాక కైకాల సత్యనారాయణ నిర్మాతగానూ టాలీవుడ్ లో తన మార్క్ చూపించారు. రమా ఫిలింస్ అనే బ్యానర్ స్థాపించి ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ వంటి సినిమాలను కూడా నిర్మించారు. అనంతరం కైకాల తర్వాత ఆయన వారసుడు రామారావు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కన్నడలో కొన్ని సినిమాలకి సహాయ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే కైకాల రామారావు పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘కేజీఎఫ్ 1’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పని చేశారు. ‘కేజీఎఫ్ 1’ సినిమా అవుట్ పుట్ చూసి హిట్ అవుతుందని భావించి కైకాల రామారావు ఆయన తండ్రి సత్యనారాయణకు సినిమా గురించి చెప్పి తెలుగులో రిలీజ్ చేద్దామని అడిగారు. దానికి ఆయన ఓకే అనడంతో మరో నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రంతో కలిసి కేజీఎఫ్ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ లో టైటిల్స్ కంటే ముందే కైకాల సత్యనారాయణ సమర్పించు అని కూడా పడుతుంది. అలా కేజీఎఫ్ సినిమాని తెలుగులో కైకాల సత్యనారాయణ రిలీజ్ చేశారు. కేజీఎఫ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఆ చిత్ర బృందం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణ పాల్గొని.. హీరో యశ్ గురించి ప్రస్థావించారు. యశ్ నటన చూసి ఆయనను అభినందించారు. మున్ముందు గొప్ప హీరోగా యశ్ ప్రేక్షుకుల ఆదరణ పొందుతాడని కైకాల అన్నారు. ఇలా నాలుగేళ్ల క్రిందటే సత్యనారాయణ యశ్ గురించి చెప్పిన మాటలను ప్రస్తుతం కన్నడ పరిశ్రమ మరియు హీరో యశ్ గుర్తుచేసుకుంటూ కైకాల మరణం పట్ల యశ్ నివాళులర్పించారు.
ఇదీ చదవండి: కైకాల సొంతూరు కౌతవరం: 30 ఏళ్ల కిందటే హాస్పిటల్ కట్టి దానం చేసిన సత్యనారాయణ