Encounter In Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్
Two Maoists Killed In Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని చోటేబేటియా పోలీస్ట్ సేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మావోలు మృతిచెందారు. ఇందులో ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. కాగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో డీఆర్జీ, బీఎస్ఎఫ్ పోలీసులు కాంకేర్ జిల్లాలోని అడువుల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అమతోలా- కల్పార్ గ్రామాల సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు మావోలు చనిపోయారు. ఈమేరకు కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్ ఎలెసెలా వివరాలు వెల్లడించారు. కాగా అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు.
మరోవైపు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం కొంతకాలంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోలు, మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా, కీలక నేతల మృతికి సంతాపంగా మావోయిస్టు పార్టీ నేడు తెలంగాణ, ఆంధ్రా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళే ఎన్ కౌంటర్ జరగడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగిపోయింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.