Last Updated:

CM Chandrababu : టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభం.. సీఎం చంద్రబాబు

CM Chandrababu : టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభం.. సీఎం చంద్రబాబు

CM Chandrababu : కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని, చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్‌ కల్పించారని గుర్తుచేశారు.

తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని, ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేని ముర్ఖుడన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ప్రస్తుతం మహిళలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామని. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని, రిజర్వేషన్లు పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు.

పసుపు, కుంకుమ కింద రూ.10 వేల చొప్పున రూ.9,689 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఏపీలో మహిళలకు భద్రత, నమ్మకాన్ని కలిగించామన్నారు. టీడీపీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ అన్నారు. దీపం-2 పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. డ్వాక్రాలో మహిళలు రూపాయి పొదుపు చేస్తే తాను రూపాయి ఇచ్చినట్లు గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని, రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. భూమి అంటే సెంటిమెంట్‌ అన్నారు. ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడరని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమరావతి బతికి ఉందంటే కారణం మహిళలు చూపించిన చొరవేనని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి: