CM Chandrababu: రెండు రాష్ట్రాలు సర్వనాశనం .. అప్పులు చేసి ఉచితాలా?

AP CM Chandrababu First Reaction On Delhi Election Results: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలో వైసీపీ సంక్షేమం పేరుతో రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే నాడు వైసీపీని, నేడు ఆమ్ఆద్మీ పార్టీలను ప్రజలు దారుణంగా తిరస్కరించారని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద ఆయన మీడియాతో మాట్లాడారు.
సంపద లేకుండా..
సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని చంద్రబాబు అన్నారు. సుపరిపాలనతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో 3 వేల డాలర్ల తలసరి ఆదాయం ఉందని, బిహార్‌లో అది ఇంకా 750 డాలర్లుగానే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఏపీలో నాడు అప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ సాయంతో ముందుకెళ్లామని, దీంతో ఐటీ, మౌలిక వసతులు గేమ్‌ఛేంజర్‌గా మారాయని సీఎం చెప్పుకొచ్చారు.
మోదీ నేతృత్వం కీలకం
సరైన సమయంలో దేశానికి సరైన నాయకత్వం చాలా అవసరమని, భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అని చంద్రబాబు కొనియాడారు. స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్.. గుజరాత్ అభివృద్ధికి కారణం అయ్యాయని గుర్తుచేసుకున్నారు. అయితే, కొందరు నేతలు ఇలా కష్టపడి పనిచేసి, సంపద సృష్టిస్తుంటే.. కొందరు దుర్మార్గులైన నేతలు ఆ ఫలాలను అవినీతికి పాల్పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు.
అక్కడా.. ఇక్కడా అదేతీరు
ఢిల్లీ, ఏపీలో వైసీపీ, ఆప్ పార్టీలు సంపద సృష్టించకుండా, వెల్ఫేర్ పేరుతో విధ్వంసం సృష్టించాయని చంద్రబాబు విమర్శించారు. విధ్వంసం చాలా సులభమని, నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. సంపద సృష్టించలేని వ్యక్తులకు బటన్ నొక్కే అధికారం ఎక్కడుందన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ రుషికొండ ప్యాలెస్ నిర్మించగా.. ఢిల్లీలో కేజ్రీవాల్ శీష్‌మహల్ నిర్మించారని పలువురు మండిపడ్డారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ అవినీతికి పాల్పడితే, ఏపీలోనూ మద్యం పేరుతో ఐదేళ్లు వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని వ్యాఖ్యానించారు.