CM Revanth Reddy: స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే!
![CM Revanth Reddy: స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/cm.webp)
CM Revanth Reddy Key Comments in CLP Meeting: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సీఎల్పీ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కులగణన, వర్గీకరణపై చర్చ..
ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలు, నిర్ణయాలతోపాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. చారిత్రాత్మకంగా బీసీ కులగణన చేపట్టిన విషయాన్ని అన్నివర్గాల ప్రజలకు చేరాలని సూచించారు.
గ్రామాలను ఏకగ్రీవం చేయాలి…
రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలన్నారు. సీసీరోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులు, నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని సూచించారు.
త్వరలో బహిరంగ సభలు..
మెదక్ పరిధిలోని గజ్వేల్, సూర్యపేటలో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. బీసీ కులగణన విజయవంతంపై సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టనున్నట్లు తెలిసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యఅతిథిగా పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణపై మెదక్ పరిధిలోని గజ్వేలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేను ముఖ్యఅతిథిగా పిలిచేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది.
విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి..
కులగణన సర్వేపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై దీటుగా స్పందించాలని రేవంత్ ఎమ్మెల్యేలకు సూచించారు. మరోవైపు బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని కోరారు. పార్టీలో కొత్త, పాత నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
10మంది ఎమ్మెల్యేలు దూరం..
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటం, శాసనసభ కార్యదర్శి నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో వివాదాన్ని మరింత జఠిలం చేసుకోకుండా సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం మంచిది కాదనే అభిప్రాయంతోనే దూరంగా ఉన్నట్లు సమాచారం.
సీఎంను కలిసిన ఎస్టీ ఎమ్మెల్యేలు..
ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి మంత్రి సీతక్క సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. సమావేశంలో ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎంను కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో రహదారులు, ఇందిరమ్మ ఇళ్లు, బోరుబావులు, విద్యుత్, పోడుభూముల సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం రేవంత్‌కు డబ్ల్యూఈఎఫ్ ప్రశంసలు..
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న సీఎంను సుసంపన్నత, నగర రవాణా సౌకర్యాలు, న్యాయపూర్వక ఆర్థిక వృద్ధి వంటి అత్యవసరమైన గ్లోబల్ అంశాలపై ఆయన చూపిన దృష్టి, లోతైన అవగాహన, విశ్వవ్యాప్త లక్ష్యాలపై స్పష్టమైన ఆలోచనలతో ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని డబ్ల్యూఈఎఫ్ తన అధికారిక లేఖ పత్రంలో ప్రశంసించింది. రేవంత్ దూరదృష్టిని, సమర్థమైన ఆలోచన విధానాన్ని, సమాజ హితం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా కొనియాడింది. రాబోయే పదేళ్లలో తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా మారుతుందన్న రేవంత్ మాటలు డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరైన పెట్టుబడుదారులకు స్ఫూర్తినిచ్చాయని వెల్లడించింది.
కాంగ్రెస్ వర్గాల హర్షం..
రేవంత్ ఆశయ సాధనకు, భవిష్యత్ ప్రణాళికల అమలుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని డబ్ల్యూఈఎఫ్ పేర్కొన్నది. తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ సంకల్పానికి, ప్రణాళికలకు, నూతన ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమ విధానాలు, అభివృద్ధి పథకాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.