Last Updated:

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 16,300 కోట్ల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్!

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 16,300 కోట్ల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్!

Central Cabinet gives seal of approval to National Critical Minerals Mission: నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

మిషన్ లక్ష్యం అదే..
దేశీయంగా, విదేశాల్లో ఉన్న కీలక ఖనిజాల తవ్వకం,ప్రాసెసింగ్ దిశగా దేశీయ సంస్థలను ప్రోత్సహించటం, తద్వారా విదేశీ దిగుమతులను తగ్గించుకుని, ఈ రంగంలో స్వయంసమృద్ధిని సాధించటమే ఈ మిషన్ లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో కీలక ఖనిజాల ఉత్పత్తికి సత్వర అనుమతులు, ఖనిజాలు వెలికి తీసే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పలు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. దేశంలో, దేశం బయట ఖనిజాల కోసం అన్వేషణ, కొత్త బ్లాక్‌లను కొనుగోలు చేయడం, క్లిష్టమైన ఖనిజ మైనింగ్‌ ప్రాజెక్టుల కోసం ఫాస్ట్‌ట్రాక్‌ ఆమోద ప్రక్రియను రూపొందించడం వంటి లక్ష్యాలను ఈ మిషన్‌ పర్యవేక్షించనున్నది. పీఎస్‌యూలు, ప్రైవేటు సంస్థలు విదేశాల్లో కీలకమైన ఖనిజాలను పొందేలా ప్రోత్సహించడం, వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని పెంచడం ఈ మిషన్‌ లక్ష్యమని కేంద్రం పేర్కొంది. భారతదేశంలో కీలకమైన ఖనిజాల నిల్వను పెంచాలనీ ఈ మిషన్ యోచిస్తోంది.

ఇథనాల్ ధర పెంపుకు ఓకే
ఈ సందర్భంగా కేంద్రం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ కొనుగోలు చేసే విధానానికి సైతం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపింది. అలాగే.. సీ కేటగిరి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ ఎక్స్-మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుండి రూ.57.97కి పెంచడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇథనాల్ సరఫరాదారులకు ధరల స్థిరత్వం తీసుకురావడం, లాభదాయకంగా మారేలా చూడటంతో బాటు ముడి చమురు దిగుమతుల మీద అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనివల్ల విదేశీ మారకం ఆదా కావటంతో బాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. గత పదేళ్లలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల సుమారుగా రూ.1,13,007 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని కేంద్రం ప్రకటించింది.