Last Updated:

CM Revanth Reddy: మారీచుల మాయలో పడొద్దు .. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

CM Revanth Reddy: మారీచుల మాయలో పడొద్దు .. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

CM Revanth Reddy says Rythu Bharosa to Farmers After Sankranti: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ, ఉచిత రైతు బీమా, సన్నాలకు బోనస్ వంటివి అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న మేలు చూసి ఓర్వలేకనే విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పలు అంశాల మీద కామెంట్ చేశారు.

పారదర్శకంగా పనిచేశాం
తెలంగాణ వచ్చే నాటికి రూ.16వేల కోట్ల మిగులుతో ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్లలో దివాలా తీయించారని సీఎం మండిపడ్డారు. సుమారు రూ.7లక్షల అప్పును తమకు అప్పగించి పోయారని, దాని మీద నెలకు 6500 కోట్ల రూపాయలు వడ్డీలుగా కడుతున్నామని వెల్లడించాంరు. తాము అధికారంలోకి రాగానే, అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పామన్నారు. రైతులే తమ ఎజెండా అన్నారు.

రూ.21వేల కోట్ల రుణాలు మాఫీ
కేసీఆర్‌ బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతుబంధు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చాలా అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీని, 4 విడతల్లో చేసిందని, అదీ అందరికీ కాదన్నారు. కానీ, తాము మాత్రం 2018 నుంచి 2023 వరకు తీసుకున్న పంటరుణాలన్నీ ఏకకాలంలో తీర్చామన్నారు.

రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ..
రానున్న సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ప్రకటించారు. రైతు భరోసా అమలుపై భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ నెలలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా అమలు చేస్తామన్నారు.

కిషన్ రెడ్డికి గుజరాత్ బానిస..
బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్‌పై సీఎం రేవంత్ స్పందించారు. కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కే లేదని, ఆయన గుజరాత్‌కు బానిస అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గతంలో ఇచ్చిన హామీలపై కూడా కిషన్ చర్చకు సిద్ధం కావాలన్నారు. కేంద్రమంత్రిగా ఉండి కేంద్రం నుంచి తెలంగాణకు ఆయన తెచ్చిన నిధులేవీ అని ప్రశ్నించారు.

రైతులూ.. ఆగం కావద్దు
‘నెహ్రూ నుంచి వైఎస్సార్ దాకా రైతులే మా ఎజెండా. కేసీఆర్ బకాయి పెట్టిన రైతుబంధును మేం చెల్లించాం. అధికారంలోకి రాగానే రూ.7,625కోట్ల రైతుబంధు నిధులు చెల్లించాం. ఆగస్టు 15నాటికి 22.22లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ఆగస్టు 15నాటికి రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమచేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తాం. మారీచుల మాయ మాటలు రైతులు నమ్మొద్దు’అని సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు సూచించారు.