Last Updated:

CM Nithish Kumar: ప్రత్యేక హోదానే 2024లో ఎన్నికల అజెండా?

ప్రత్యేక హోదా అంశమే ప్రధానంగా 2024లో ఎన్నికల అజెండాగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తానాయా అంటే అవుననేలా బీహార్ సిఎం నితీశ్ కుమార్ మాట్లాడుతున్నారు

CM Nithish Kumar: ప్రత్యేక హోదానే 2024లో ఎన్నికల అజెండా?

Bihar: బీజేపీతో చెట్టాపట్టాలేసుకొన్న నితీశ్ తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలతో జత కట్టారు. సంకీర్ణ సర్కారులో ఆయన బీహార్ సీఎంగా కొలువుదీరారు. 2024 ఎన్నికల్లో బీజేపియేతర ప్రధాని అభ్యర్ధిగా నితీశ్ పేరు అత్యధికంగా వినపడుతుంది. అయితే దాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సుముఖత చూపించారు. అందుకు 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు మెజారిటీ సీట్లు సంపాదించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల కూటమిని ఏకతాటిపై తెచ్చేందుకు నితీశ్ కుమార్ పలు పార్టీలకు చెందిన కీలక నేతలను కలుసుకొని రానున్న పార్లమెంటు ఎన్నికలపై అనేక ఊహాగానాలకు తెరదీసారు. త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా ఆయన సమావేశం కానున్నారు.

అయితే నితీశ్ కు కొన్ని ప్రాంతాల్లోని పార్టీలతో స్వల్ప తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ తో హోరా హోరీ పోరాటాన్ని తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపధ్యంలో కేసీఆర్ వైఖరి 2023 లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన వ్యవహారం బయటపడనుంది. అదే విధంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పనైపోయిందని పదే పదే చెబుతున్నారు. ఆయన వ్యవహారం కూడా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల అనంతరం బయటపడనుంది. ఇక ఒడిస్సీ సీఎం నవీన్ పట్నాయక్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉండడంతో పాటుగా కాంగ్రెస్ పై ఆయన వైఖరిని బయటపెట్టడం లేదు.

ఓ వైపు నితీశ్ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా అంటుంటే, మరో అడుగు ముందుకేసిన కేసిఆర్ దేశమంతా ఉచిత విద్యుత్ అంటూ పెద్ద పెద్ద ప్రకటనలే గుప్పిస్తున్నారు. భాజపా అగ్రనేతలు మాత్రం ఏమి మాట్లాడం లేదు. చాపకింద నీరులా అన్ని రాష్ట్రాల్లో బీజేపి పాలన సాగేలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు తాయిలాలు, బెదిరింపులతో తన పని తాను చేసుకొని పోతూ ఉంది. ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాల్లో 2023లో త్రిపుర, రాజస్ధాన్, తెలంగాణ, మీజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, నాగాలాండ్, కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో గెలుపు ఓటముల అనంతరం 2024 జాతీయ ఎన్నికల్లో తీసుకోవాల్సిన ఎత్తుల పై ఆలోచనలు పెట్టవచ్చన్న భావనలో కేంద్ర పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: