Last Updated:

Janasena Party: ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన పార్టీ

ఏపీ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. పదే పదే విశాఖ రాజధానిగా ఉండాలంటూ అమరావతి రాజధాని పై రగడ చేస్తున్న వైకాపా శ్రేణులు నోరెళ్లబెట్టేలా జనసేన పార్టీ లేఖాస్త్రం సంధించింది

Janasena Party: ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన పార్టీ

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. పదే పదే విశాఖ రాజధానిగా ఉండాలంటూ అమరావతి రాజధానిపై రగడ చేస్తున్న వైకాపా శ్రేణులు నోరెళ్లబెట్టేలా జనసేన పార్టీ లేఖాస్త్రం సంధించింది. అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంకు వస్తున్న తరుణంలో పార్టీ కార్యకర్తలకు విటమిన్ లాంటి పదునైన మాటలను వారికి అందించారు. ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నాన్ని జనసేన పార్టీ చేసింది. ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన లేఖలోని సారాంశం మేరకు,

ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభా వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టింది నేటి ఉత్తరాంధ్ర మంత్రులు కాదా అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే జగన్ ను పొగుడుతూ స్వలాభం కోసం బొత్స, ధర్మాన మంత్రులు వింతగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జనవాణి కార్యక్రమంలో అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని, ఆయన వంద కి.మీ దూరంలోని బాధితులు వచ్చి సమస్యలు విన్నవించుకొంటారని నాదెండ్ల పేర్కొన్నారు. పవన్ కు తమ సమస్యలు చెప్పుకొంటే, ఇకనైనా ప్రభుత్వం మొండి నిద్ర నుండి మేల్కొంటుందనేది జనసేన ఉద్దేశంగా ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొరకు ఏర్పాటు చేసిన ఐటీ టవర్లన్నీ ఖాళాగా ఉన్నాయంటూ రుజువులు చూపించారు. విశాఖ మధురవాడలోని మిలీనియం టవర్ ఏ బ్లాక్ లో లక్ష చదరవు అడుగులు ఖాళీగా ఉన్నాయన్నారు. టవర్ బీలో నిర్మించిన 1.13 లక్షల చదరపు అడుగులు ఐటి పరిశ్రమల కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. తిరుపతిలో 50వేల చదరపు అడుగులు, అచ్చుతాపురంలో 5500 అడుగులు, బొబ్బిలిలో 27వేల చదరపు అడుగులతో నిర్మించిన భవనాల్లో ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంపై మీ సమాధానం ఏదంటూ జనసేన ప్రశ్నించింది. అక్టోబర్ 13 వచ్చేసినా, 1వ తేదీన వస్తారని చెప్పిన ఇన్ఫోసిస్ ఏమైందని ప్రశ్నించారు. వెయ్యి మంది ఉద్యోగులకు అని మాయమాటలు చెప్పారని అన్నారు. ఇది మీ ప్రోగ్రస్ రిపోర్టు అంటూ మంత్రి గుడివాడ అమర్నాధ్ కు జనసేన పార్టీ హితబోధ చేసింది. ముందు వీటిపై దృష్టి పెట్టి జనసేనను అనంతరం తిట్టండి అంటూ లేఖలో పేర్కొన్నారు.

పదవులు పొందింది ప్రజల సమస్యలు తీర్చడానికేనని గుర్తు పెట్టుకోవాలంటూ జనసేన ఉత్తరాంధ్ర మంత్రులనుద్ధేశించి పేర్కొనింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల్లో 40 శాతం మంది ఉత్తరాంధ్రలో జీవిస్తున్నారని, వారికి ప్రభుత్వం నుండి సరైన భరోసా లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర విభజనలో భాగంగా ఉత్తరాంధ్రకు వచ్చిన గిరిజన యూనివర్శిటీ నిర్మాణంపై జవాబు చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది. రూ. 834కోట్లతో తలపెట్టిన యూనివర్శిటీ నిర్మాణంలో గత తెదేపా ప్రభుత్వం 10 కోట్ల వెచ్చించి ప్రహరి గోడ నిర్మిస్తే, మిగిలిన నిర్మాణ పరిస్ధితి అతి గతి లేకుండా ఉందని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసమంటూ 25లక్షల ఎకరాలకు సాగునీరు పేరుతో సుజల – స్రవంతి ప్రాజెక్టు కు సీఎం జగన్ శంకుస్థాపనకే పరిమితమైనారని ఎద్దేవా చేశారు.

మూడు రాజధానులపై చిత్త శుద్ధి ఉంటే శాసనసభా వేదికగా ప్రవేశపెట్టిన తీర్మానాలు, చట్టాలు ఎందుకు ఉపసంహరించుకొన్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాంతాల మద్య విభేధాలు సృష్టించి విద్వేషాల రగిల్చి చలి కాచుకోవాలన్నదే వైసీపీ ప్రభుత్వ పన్నాగంగా దుయ్యబట్టారు. వైసీపీ కుటిల పన్నాగాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రసాదించిన సహజ ఆస్తులపై కన్నేసిన క్రమంలో కొత్త రాగం అందుకొంటున్నారే గాని, అభివృద్ధి కోసం కాదని లేఖలో పేర్కొన్నారు. విశాఖ భూముల కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ రిపోర్టును బయటపెట్టాలని జనసేన డిమాండ్ చేసింది.

చివరగా మంత్రి గుడివాడ అమర్నాధ్ కు జనసేన పార్టీ మొట్టికాయలు వేసింది. పిన్న వయసులో మంత్రి పదవి పొందింది ఇతర పార్టీలను తిట్టేందుకు కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ఓ ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావోలో దృష్టి పెట్టండి అంటూ మంత్రికి జనసేన హితభోద చేసింది. గతంలో ఏపీఐఐసీ పరిశ్రమల కోసం తీసుకొన్న రైతుల భూములను నేడు హౌసింగ్ ప్రాజెక్టుల కోసం అమ్మి, రూ. 400 కోట్లు సేకరిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే మీ స్పందన లేకపోవడంపై ఏమని అనుకోవాలని జనసేన ఘాటుగా లేఖలో ప్రస్తావించింది.

ఇది కూడా చదవండి:Pawan Kalyan: విశాఖ.. పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారు

ఇవి కూడా చదవండి: