Waqf Bill : లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు.. విపక్షాలపై రిజిజు విమర్శలు

Waqf Bill : కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభలో ప్రసంగించారు. బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తిగా చెబుతారని ఆరోపించారు.
విపక్షాలు అసత్య ప్రచారం..
బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయని మండిపడ్డారు. బిల్లులోని అంశాలను లేవనెత్తి ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. అది అప్రజాస్వామికమని ఆనాడు ఎవరూ చెప్పలేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభ్యులతో కూడిన జేపీసీకి అభినందనలు తెలిపారు.
మొత్తం 284 ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయని తెలిపారు. తాము బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే.. ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. బిల్లు తీసుకురాకపోతే కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పందనకు గతంలో ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలు కారణమన్నారు. పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తికి సంబంధించినవని అజ్మల్ అప్పట్లో వాదించిన విషయాన్ని గుర్తుచేశారు.
బిల్లును ఆహ్వానించిన ముస్లిం ప్రతినిధులు..
వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి చెందిన మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయం మాత్రమేనని అన్నారు. బిల్లుకు మద్దతు ఇచ్చేవారు, వ్యతిరేకించేవారు ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు. పేద ముస్లింలకు వక్ఫ్ ఆస్తులను ఉపయోగించాలని, వారిని అలా వదిలేయకూడదన్నారు. వారి ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? అని మండిపడ్డారు.
ముస్లిం ప్రతినిధులు బిల్లును ఆహ్వానించారని కొనియాడారు. వీలైనంత త్వరగా దీనికి ఆమోదం లభించాలని కోరుకుంటున్నారని తెలిపారు. రిజిస్టర్ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు వారి హక్కులు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి విషయంలో వివాదం తలెత్తితే కలెక్టర్ కంటే పైస్థాయి వ్యక్తి తీర్పు ఇవ్వాలంటూ జేపీసీ చేసిన ప్రతిపాదనను తాము అంగీకరించామని రిజిజు స్పష్టత ఇచ్చారు. మరోవైపు విపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కోల్‌కతాలో మార్చ్ జరిగింది.