Last Updated:

Maharashtra: ‘15 నుంచి 20 రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది’

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ లో చేరతారనే ఊహాగానాలు వస్తుంటే..

Maharashtra: ‘15 నుంచి 20 రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది’

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ లో చేరతారనే ఊహాగానాలు వస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి కోసం 2024 వరకు ఎందుకు అని.. ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివసేన యూబీటీ నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిండే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే 15 నుంచి 20 రోజుల్లో కూలిపోతుందని జోస్యం చెప్పారాయన.

 

ఇప్పటికే ‘డెత్‌ వారెంట్‌’ జారీ(Maharashtra)

ఈ సందర్భంగా సంజయ్.. ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ప్రస్తుతం శిండే వర్గంలో ఉన్న 16 మంది శివసేన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో సహా పలు పిటిషన్లపై పెండింగ్‌లో ఉన్న సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావించారు. కోర్టు ఆదేశాల కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని.. తమకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం సీఎం, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లో కూలిపోతుంది. ఈ మేరకు ఇప్పటికే ‘డెత్‌ వారెంట్‌’ జారీ అయింది’ అని రౌత్‌ పేర్కొనడం గమనార్హం.

 

 

అనర్హతపై తీర్పు రిజర్వ్

అయితే, గత ఏడాది జూన్‌లో శిండేతో పాటు 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీంతో పార్టీలో చీలిక వచ్చింది. ఫలితంగా ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. అనంతంర బీజేపీ తో కలిసి ఏక్‌నాథ్‌ శిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరో వైపు.. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో శిండే వర్గం కూడా క్రాస్ పిటిషన్‌ వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది.