Last Updated:

Economic Crisis: ఈ రాష్ట్రాలకు శ్రీలంక పరిస్దితి తప్పదా?

మన దేశంలో కొన్ని రాష్ట్రాలు శ్రీలంక బాటలో పయనించనున్నాయా? ఎందుకంటే ఆయా రాష్ర్టాల రెవెన్యూలో పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. ఉదాహరణకు పంజాబ్‌నే తీసుకొంటే రెవెన్యూలో 21.3 శాతం, తమిళనాడు 21 శాతం, పశ్చిమ బెంగాల్‌ 20.8 శాతం, హర్యానా 20.9 శాతం వడ్డీలు చెల్లిస్తున్నాయి. ఆదాయంలో 20 శాతంపైనే వడ్డీలు చెల్లిస్తూపోతే ....రాష్ట్రాలు ఆర్థికంగా చతికిలపడటం ఖాయమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Economic Crisis: ఈ రాష్ట్రాలకు శ్రీలంక పరిస్దితి తప్పదా?

Indian Economic Crisis: మన దేశంలో కొన్ని రాష్ట్రాలు శ్రీలంక బాటలో పయనించనున్నాయా? ఎందుకంటే ఆయా రాష్ర్టాల రెవెన్యూలో పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. ఉదాహరణకు పంజాబ్‌నే తీసుకొంటే రెవెన్యూలో 21.3 శాతం, తమిళనాడు 21 శాతం, పశ్చిమ బెంగాల్‌ 20.8 శాతం, హర్యానా 20.9 శాతం వడ్డీలు చెల్లిస్తున్నాయి. ఆదాయంలో 20 శాతంపైనే వడ్డీలు చెల్లిస్తూపోతే ….రాష్ట్రాలు ఆర్థికంగా చతికిలపడటం ఖాయమని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో మన దేశంలో కొన్ని రాష్ట్రాలు తాహతుకి మించి ప్రజలకు ఉచితాలు ఆఫర్‌ చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీన దేశంలోని టాప్‌ బ్యూరోక్రాట్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందకు కొన్ని రాష్ర్టప్రభుత్వాలు తాయిలాలు ప్రకటిస్తున్నాయని, దీంతో పలు రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్ష కట్టుతప్పి దివాలా తీస్తాయని, రాష్ట్రాల అప్పులు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం శ్రీలంక ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందో అదే పరిస్థితి ఈ రాష్ట్రాలు ఎదుర్కొంటాయని.. ఆ బ్యూరోక్రాట్‌ ప్రధానమంత్రికి వివరించి చెప్పారు. శ్రీలంకను ఉదాహరణగా తీసుకొని ఇప్పటి నుంచే జాగ్రత్తపడకపోతే మనం కూడా శ్రీలంక బాట పట్టాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక విషయానికి వస్తే కరోనా నేపథ్యంలో టూరిజం ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఎగుమతులు ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌, తేయాకు ఆర్డర్లు తగ్గిపోయాయి. అలాగే విదేశాల్లో ఉండే శ్రీలంక పౌరుల నుంచి రావాల్సిన రెమిటెన్స్‌ కూడా గణనీయంగా తగ్గిపోవడంతో శ్రీలంక ఆదాయం తగ్గిపోయింది. మరో వైపు శ్రీలంక ప్రభుత్వ పాలసీలు దీనికి తోడయ్యాయి. ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాల్సిందినని రాయితీలపై రాయితీలు ఇచ్చుకుంటూ పోయింది. ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాల్సిందేనని ప్రభుత్వం పట్టుబట్టడంతో దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో ఆహార ధాన్యాలకు దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. దిగుమతులు చెల్లించడానికి చేతిలో విదేశీ మారకద్రవ్యం లేకుండా పోయింది. అప్పటికే విదేశాల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో శ్రీలంక దివాలా తీసింది. ప్రపంచం ముందు దేహీ అంటూ చేతులు ఆర్రులు చాచాల్సిన దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టబడింది.

ఇక మన దేశంలోని పలు రాష్ట్రాల విషయానికి వస్తే 2011-12 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు దశాబ్ద కాలం పాటు రాష్ర్టాలు గరిష్ట ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి రుణాలు తీసుకుంటూ వచ్చాయి. రాష్ర్ట గరిష్ఠ స్థూల దేశీయ ఉత్పత్తి  జీఎస్‌డీపీ ప్రకారం మూడు శాతం కంటే కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడానికి వీల్లేదు. గత దశాబ్దం వరకు రాష్టాల ద్రవ్యలోటు తమ జీడీపీలో 2.5 శాతం వరకు ఉండేది. సర్దుబాటు అయ్యేది. ప్రస్తుతం పలు రాష్ర్టాలు పరిమికి మించి అప్పులు చేస్తున్నాయి. ఈ అప్పులు తమ రాష్ర్ట జీడీపీలో 3.5 శాతం దాటిపోతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌ల ద్రవ్యలోటు తమ జీడీపీలో 3.5 శాతానికి ఎగబాకుతోంది. కాగా అస్సాం, గుజరాత్‌, మహారాష్ర్ట, ఒడిషా, దిల్లీలు మాత్రం పరిమితిలోపే రెండు శాతం దాటడం లేదు. రాష్ట్రాల బ్యాలెన్స్‌ షీట్లు 2020 నుంచి అదుపు తప్పుతున్నాయి. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారితో, రాష్ట్రాల అప్పులు విపరీతంగా పెరిగిపోవడం, అదేసమయంలో అడ్డు అదుపు లేకుండా విచక్షణా రహితంగా ఉచితాలు ప్రకటించుకుంటూ పోవడంతో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటోంది.

ఇటీవలే రిజర్వుబ్యాంకు ఒక నివేదికలో దేశంలోని పలు రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని వెల్లడించింది. వాటిలో పంజాబ్‌, రాజస్తాన్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ర్టాలు పరిమితి కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటున్నాయని తేల్చి చెప్పింది. దేశంలోని అన్నీ రాష్ర్టాలు చేసే వ్యయంలో ఈ పది రాష్ర్టాలే 50 శాతం వరకు వ్యయం చేస్తన్నాయని తేల్చి చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా ప్రకారం ఆంధప్రదేశ్‌ రాష్ర్ట జీడీపీలో అప్పులే 32.8 శాతం ఆక్రమించగా.. బీహార్‌ 38.7 శాతం, కేరళ 37.2 శాతం, మధ్యప్రదేశ్‌ 33.3 శాతం, పంజాబ్‌ గత ఆర్థిక సంవత్సరంలో 53.3 శాతం, రాజస్థాన్‌ 39.8 శాతం, ఉత్తరప్రదేశ్‌ 32.5 శాతం, పశ్చిమ బెంగాల్‌ 34.2 శాతం వరకు అప్పులే ఉన్నాయి. ఇక ఈ రాష్ట్రాలు తీసుకున్న రుణాల్లో పెద్ద మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మాత్రం ఆరోగ్యం కరంగా లేదని తెలుస్తోంది. ఉదాహరణకు పంజాబ్‌ను తీసుకుంటే తమ రెవెన్యూలో 21.3 శాతం వడ్డీలు చెల్లించడానికి సరిపోతోంది. తమిళ నాడులో 21 శాతం, పశ్చిమ బెంగాల్ ‌20.8 శాతం, హర్యానా 20.9 శాతం రుణాలపై వడ్డీలు చెల్లిస్తున్నాయి.

దేశంలోని పలు రాష్ట్రాల అప్పులు కాస్తా పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు డిస్కంలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డిస్కం సరఫరా చేసే విద్యుత్‌కు రాష్ర్టాలు గ్యారంటీ ఇస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 16 రాష్ట్రాలు కలిపి డిస్కంలకు లక్షా 36వేల కోట్ల రూపాయలు బకాయిపడ్డాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం డిస్కం నష్టాల్లో 24.7 శాతం వాటా బీహార్‌, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌లే ఆక్రమించాయి. ఒక వేళ డిస్కం బ్యాంకులకు చెల్లించాల్సిన రుణం డిఫాల్ట్‌ అయితే… రాష్ర్టప్రభుత్వాలపై మరింత భారం పడుతుంది. ఎందుకంటే డిస్కంలకు రాష్ర్టప్రభుత్వాలు గ్యారంటీ ఇచ్చాయి కాబట్టి. ఇప్పటి నుంచే రాష్ర్టప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితులు గాడినపడే అవకాశాలున్నాయని ఆర్థిక నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాలు రిజర్వుబ్యాంకు నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా తీసుకున్న రుణాలకు పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్నాయి. రాష్ట్రాలు వడ్డీలు తగ్గించుకోవాలంటే సంక్షేమ పథకాలు కోత విధించుకోవాల్సిందే. ఎన్నికల్లో ప్రజలకు అలివికానీ హామీలు ఇచ్చి చేతులు కాల్చుకునే బదులు ఇప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే.. రాష్ట్రాలకు శ్రీరామరక్ష. లేదంటే.. మన పొరుగు దేశాలను ఒక్కసారి కళ్లు మూసుకొని ఆలోచించుకోండి అని సలహా ఇస్తున్నారు ఆర్థిక నిపుణులు.

ఇవి కూడా చదవండి: