BJP President Ramachandra Rao: పొన్నం రేవంత్‌రెడ్డి చేత రాజీనామా చేయించాలి: రామచందర్‌రావు

BJP President Ramachandra Rao Challenges Minister Ponna Prabhakar: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీజేపీ అండగా నిలుస్తుందని, అందుకు తానే ఉదాహరణ అని రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదని స్పష్టం చేశారు.
పార్టీ అభివృద్ధికి పనిచేసిన ప్రతిఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , ఎంపీ డీకే అరుణ, సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో అందరూ ఒకటేనని, తమ మధ్య అభిప్రాయ బేధాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ప్రేమ లేదని ఆరోపించారు.
మతం ఆధారంగా తాము ఏ బిల్లును ఆమోదించబోమన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, అది ఇప్పుడు ఏమైందని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పనులు చేయలేక చేసిన తప్పులను తమపై నెడుతున్నదని మండిపడ్డారు. ప్రతిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్ బాడీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్‌రెడ్డి రేవంత్‌రెడ్డితో రాజీనామా చేయించాలని, అప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తే, తన పదవిని రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.