KTR: తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే.. కేటీఆర్ బహిరంగ లేఖ

KTR open letter to Nirmala Sitharaman by Telangana debts: బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు. తెలంగాణ దశ దిశను మార్చి రాష్ట్రానికి తరగని ఆస్తులు సృష్టించినట్లు చెప్పారు. దేశ చరిత్రలో అత్యధిక అప్పులు చేసిన మీరా.. మమ్మల్ని అనేది? కేంద్రం చేసిన అప్పులన్నీ కార్పొరేట్ల లక్షల కోట్ల రుణాల మాఫీ కోసమే అన్నారు.
ప్రతి బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరన్నారు. మోదీ సర్కార్ పదేళ్లలో రూ.125లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు ముందు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని చెప్పారు. అలాగే కేంద్రం కూడా ఎంత సహకరించినా ఆ రాష్ట్రం అప్పుల్లో నుంచి బయటపడలేక పోతోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో కేటీఆర్ కేంద్ర మంత్రికి బహిరంగ లేఖ రాశారు.