Last Updated:

KCR: మళ్లీ వచ్చేది మనమే.. ఉప ఎన్నికలొస్తున్నాయ్

KCR: మళ్లీ వచ్చేది మనమే.. ఉప ఎన్నికలొస్తున్నాయ్

KCR High Level Meeting at Telangana Bhavan: తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన

శ్రేణుల ఘన స్వాగతం
సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన తమ అధినేతను చూసేందుకు నగరం నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. కేసీఆర్ తన వాహనం దిగి పార్టీ ఆఫీసులోకి వస్తున్న సమయంలో వారంతా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో స్వల్ప తోపులాట సైతం చోటు చేసుకుంది. దీంతో కేసీఆర్ తనదైన శైలిలో ‘ఒర్లకండిరా బాబు.. దండం పెడతా’ నంటూ తనదైన శైలిలో మందలించారు. అయినా వారు తమ నినాదాలను కొనసాగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పార్టీ నిర్మాణంపై ఫోకస్
బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గానూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పార్టీలో అన్ని స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడా అధినేత ప్రకటించారు. సభ్యత్వ నమోదు కాగానే పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు, ఆ పై ప్లీనరీ నిర్వహణ ఉంటాయని ప్రకటించారు. తమది ఒక ఎన్నికలలో ఓడినంత మాత్రానే కొట్టుకుపోయే పార్టీ కాదని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు కార్యకర్తలు, నేతలంతా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 10న మీటింగ్..
పార్టీ పాతికేళ్ల ప్రస్థానం వేళ.. పార్టీలో మహిళా కమిటీలనూ నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. పార్టీలోని కమిటీల ఏర్పాటు బాధ్యతను హరీశ్ రావుకు అప్పగిస్తూ ప్రకటన చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని, ఏడాది పొడవునా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 10న మరోసారి సమావేశమై తదుపరి కార్యక్రమాలపై చర్చించి ప్రకటిస్తామని గులాబీ బాస్ ప్రకటించారు.

వందశాతం మనకే ఛాన్స్
అనంతరం సమావేశంలో కేసీఆర్..మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని వివరించారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే దారుణంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, కార్యకర్తలు, నేతలంతా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలని సూచించారు. ప్రజల మనసులో గులాబీ జెండాకు ఉన్న స్థానం ఎవరూ తుడిపేయలేనిదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికలకు రెడీ కండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు రాకపోవటంతో బీఆర్ఎస్ పార్టీలోని చాలామంది నేతలు నిరాశలో కూరుకుపోయారని కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే పదిమంది ఎమ్మెల్యేలు.. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారని వివరించారు. అయితే, కాంగ్రెస పార్టీ గ్రాఫ్ ఇప్పటికే దారుణంగా పడిపోయిందని, వచ్చే స్థానిక ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఇక పుంజుకునే అవకాశాలే లేవని జోస్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాలలో ఉప ఎన్నికలు ఖాయమని, నాయకులు, కార్యకర్తలంతా ఆయా నియోజక వర్గాల్లో విజయం సాధించేందుకు రెడీ కావాలని కేసీఆర్ సూచించారు.

గులాబీమయమైన కార్యాలయం
సుమారు 7 నెలల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ రావటంతో తెలంగాణ భవన్ అంతా గులాబీమయమైంది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు ఇలా పెద్ద సంఖ్యలో నేతలు రావటంతో కార్యాలయ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది.