Karimnagar Graduate MLC Election : తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. సిట్టింగ్ స్థానంలో ఓటమి

Karimnagar Graduate MLC Election : ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఆరేండ్ల కింద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. తప్పనిసరిగా విజయం సాధించాలని పీసీసీకి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేసినా ఓటమి తప్పలేదు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల వద్దకు వెళ్లి చెప్పి ఆకట్టుకోలేకపోయారు. ఓటర్లు గ్రాడ్యుయేట్లు కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రధాన అస్త్రంగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయంలో పట్టనట్లుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.
అభ్యర్థి ఎంపికలో జాప్యం..
కాంగ్రెస్ ముందు నుంచీ అభ్యర్థి ఎంపికలో జాప్యం చేసింది. అనుకున్న వారికి టికెట్ ఇవ్వకుండా చివరి క్షణంలో మరొకరికి ఇవ్వడం పార్టీకి నష్టం కలిగించింది. పోలింగ్‌కు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లి మూడు చోట్ల సభలు పెట్టినా ఫలితం దక్కలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ద్విముఖ పోరు గురించే ఎక్కువగా చర్చ జరిగింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని హరికృష్ణ ముందు నుంచి క్షేత్రస్థాయిలో పనిచేశారు. చివరి క్షణంలో నరేంద్‌రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. దీంతో హరికృష్ణ బీఎస్పీ పార్టీ నుంచి బరిలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారింది. హరికృష్ణకు టికెట్ ఇవ్వాలని కోరిన కొందరు నేతలు నరేందర్‌రెడ్డి విజయానికి కష్టపడి పనిచేయలేదని తెలుస్తోంది. ఉద్యోగులకు, రిటైరైన వారికి బిల్లుల చెల్లింపులు ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటం కూడా విద్యావంతుల్లో అసంతృప్తి ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
పదవుల ధ్యాసే..
త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల నియామకాలు, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకం ఉంటుందని ఆశావహులు కాంగ్రెస్ పార్టీ గెలుపునను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తారని ముందు అందరూ భావించారు. కానీ, నేతలు ఎవరూ పెద్దగా క్షేత్రస్థాయిలో తిరగలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే మెజార్టీని ఎమ్మెల్యేల పనితీరుకు గీటురాయిగా పరిగణిస్తామని అధిష్ఠానం ముందే చెప్పినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని పలుమార్లు చెప్పినా వ్యూహాన్ని ఛేదించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్‌లో నేతలు సరిగా పనిచేయలేదు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక.
సీఎం ముందే అప్రమత్తం చేసినా…
ఎమ్మెల్సీ నియోజకవర్గం 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. జిల్లాల పరిధిలో కాంగ్రెస్‌కు ముగ్గురు మంత్రులు, నలుగురు ఇన్‌చార్జి మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమించింది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో ఒకరు కేంద్ర మంత్రి ఉండగా, గట్టిగా పోరాడతారని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పార్టీ స్థానిక శ్రేణులతో కలిసి వ్యూహం రచించాలని ముఖ్యమంత్రి రేవంత్ ముందే సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో చాలామంది పనిచేయలేదు.