Chandrababu Swear-in Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు
ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు
Chandrababu Swear-in Ceremony: ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహుతుల కోసం ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రధాని మోదీ హాజరవుతుండడంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
14 ఎకరాల స్థలంలో ..(Chandrababu Swear-in Ceremony)
ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గన్నవరానికి చెందిన రైతులు కంకణాల రమేష్, పొట్లూరి బసవరావు, ద్రోణవల్లి ప్రదీప్, పొన్నం శ్రీరాం, కాజా నెహ్రూలకు చెందిన 14 ఎకరాల స్థలంలో తూర్పు దిశగా వేదిక ఉండేలా చేపట్టిన సభా ప్రాంగణ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ, మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. దాదాపు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఉంటాయి. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్తు దీపాలతోపాటు సభ జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపడుతున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు..
బహిరంగ సభ ఏర్పాటుకు అవసరమైన స్థలాల పరిశీలన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు డీకే బాలాజీ, ఢిల్లీ రావుతోపాటు రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శంకబ్రత బాగ్చి, ఐ.జీ.లు రాజశేఖర్ బాబు, అశోక్ కుమార్ విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.ప్రధాన బహిరంగ సభ స్థలంతోపాటు.. ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల.. జాతీయ రహదారి పక్కన మేధా టవర్స్ వెళ్లే మార్గంలో పార్కింగ్ ప్రదేశాలను సందర్శించారు. ఇప్పటికే దాదాపు 11 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేయించారు అధికారులు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రజలు, వాహనాల రాకపోకల పై సమగ్రంగా చర్చించారు. మేధా టవర్స్ పై అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుండి బహిరంగ సభ ప్రదేశాన్ని వారు పరిశీలించారు. ప్రజలు, వాహనాలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే గన్నవరం విమానాశ్రయం సందర్శించి అక్కడ పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించి ప్రముఖుల రాకపోకలపై చర్చించారు. ఈ పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల సంయుక్త కలెక్టర్లు గీతాంజలి శర్మ, సంపత్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడుకర్, డిఐజి గోపీనాథ్ జెట్టి, విజయవాడ డిసిపి అదిరాజ ఎస్. రానా, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఎమ్.ఎల్.కె రెడ్డి, గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి ఇతర అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. గతంలో ఎన్నడూ చూడనంత అంగరంగ వైభవంగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం ఎదుట మేధా టవర్స్ లో ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. నియోజకవర్గాలవారీగా పాస్‌లు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. సభా స్థలి, ఇతర ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు.