Last Updated:

AP Deputy CM Pawan Kalyan: రెండో రోజూ జనసేనాని యాత్ర.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా!

AP Deputy CM Pawan Kalyan: రెండో రోజూ జనసేనాని యాత్ర.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా!

AP Deputy CM Pawan Kalyan Temples Tour: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా జనసేనాని యాత్ర రెండవ రోజూ విజయవంతంగా సాగింది. ఈ మేరకు ఆయన పళని, తిరుపరంకుండ్రం, మధురై క్షేత్రాలను సందర్శించారు. కుమారుడు అకీరా, టీటీడీ బోర్డు సభ్యులు ఆనందసాయితో ఆయా ఆలయాలకు చేరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. అక్కడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్శనలో భాగంగా దైవ దర్శనానంతరం పవన్ ఆయా క్షేత్రాల విశేషాలను అక్కడి పండితులను అడిగి తెలుసుకున్నారు.

తొలుత పళనికి..
ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మూడవదైన.. పళనీ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. రోప్ వే ద్వారా పళని అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారిని దర్శించుకున్న పవన్.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచ తీర్థాన్ని ఆలయ పండితులు పవన్‌కు అందజేశారు.

సీఎంతో మాట్లాడి చేయిస్తా..
పళని ఆలయ దర్శనం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సదుపాయం తగినంతగా లేదని ఇక్కడి భక్తులు తన దృష్టికి తెచ్చారని, ఆ అంశంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. తాను గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. అక్కడ పర్యటించినప్పుడు అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు తనను కోరగా, ఆ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకు వెళ్లానని పవన్ వెల్లడించారు. తమిళనాడులో ఉన్న ఆరు సుబ్రహ్మణ్య ఆలయాలను దర్శించాలని ఇక్కడికి వచ్చానని, దేశక్షేమం కోసమే స్వామిని ప్రార్థించానని పవన్ తెలిపారు. రాజకీయాల గురించి మీడియా ప్రశ్నించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు.

తిరుపరంకుండ్రంలో..
అనంతరం పవన్ అక్కడి నుంచి తిరుపరంకుండ్రం చేరుకున్నారు. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో శివుడు, విష్ణువు మూర్తులకు ఎదురుగా.. వల్లీ దేవసేనా సమేతుడై కార్తికేయుడు కొలువై ఉంటాడు. అలాగే, దుర్గ, సోదరుడైన శ్రీ సత్య గణపతి చెంతన ఇక్కడి స్వామివారు కొలువై కనిపిస్తారు. కాగా, ఆలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు అక్కడి కోవెల అధికారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం, అర్చన చేయించారు. పిదప అర్చకులు స్వామివారి విశిష్టతను పవన్‌కు తెలియజేశారు.అనంతరం ఆలయం లోపలి వేద పాఠశాలను పవన్ దర్శించగా, అక్కడి విద్యార్థులు ఆయనను వేద పఠనంతో స్వాగతించి, అనంతరం ఆశీర్వచనం చేసి శాలువాతో సన్మానించారు.

మీనాక్షమ్మ సేవలో..
అనంతరం అక్కడి నుంచి పవన్.. మధురైలోని మీనాక్షీ ఆలయానికి చేరుకున్నారు. దక్షిణాదిలోనే అత్యంత గొప్పదిగా చెప్పే ఈ ఆలయంలో కొలువైన మీనాక్షీ సుందరేశ్వరులను పవన్ దర్శించుకున్నారు. తొలుత.. అమ్మవారికి సారె, చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించి అర్చన కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. అనంతరం ఆలయ ముఖమండపంలో కూర్చొని పరాశక్తి పారాయణం చేశారు. అనంతరం అక్కడి నుంచి సుందరేశ్వర స్వామిని దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆలయ శిల్పకళను, విశిష్టతలను అధికారులన, పండితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆలయంలోని శ్రీ చక్రం ఉన్న ప్రదేశానికి వెళ్లి.. అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. దర్శనం అనంతరం అక్కడి భక్తులను పవన్ పలకరించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.