Women Teachers’ Day: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 3న మహిళా టీచర్స్ డే
Telangana government Declared January 3 as Women Teachers’ Day: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా జనవరి 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ‘మహిళా టీచర్స్ డే’గా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను విద్యాశాఖ బడ్జెట్ నుంచి చెల్లించనున్నట్లు సీఎస్ ఉత్వర్లుల్లో వెల్లడించారు.
సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సావిత్రిబాయి పూలే వంటి మహానీయురాలి స్ఫూర్తిగా మహిళలను అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆనాడు దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అణగారిన మహిళలకు చదువు చెప్పారన్నారు.