Anantha Sriram: ప్రభాస్ కల్కి సినిమాపై ఆనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్
Anantha Sriram Sensational Comments: పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తెలుగు సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల నాగ్ అశ్వీన్, ప్రభస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కల్కి సినిమాపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమాలు వ్యాపారం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదన్నారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా విజయవాడలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. సినిమాల్లో హైందవ ధర్మంపై మూడు కోణాల్లో దాడి జరుగుతోంది. కావ్వేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన, వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం.. భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహాభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు ఉన్నాయి.
గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమా నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు.. కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. సినిమా వ్యక్తినే అయినప్పటికీ ఈ విషయాన్ని నేను నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నాను. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే.. పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు” అని చెప్పుకొచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే.. సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరడన్నట్టు చూపించారు. ఇలాంటి అభూతకల్పనలు వక్రీకరణలు జరుగుతున్నా.. మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైన వస్తాయి. చిత్రీకరణ, గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్ధాం” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.