Last Updated:

India vs Pakistan: కోహ్లీ సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన భారత్

India vs Pakistan: కోహ్లీ సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన భారత్

India vs Pakistan, india won by 6 wickets: ఛాంపియన్స్ ట్రోఫీలో హైఓల్టేజీ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ(100) సూపర్ సెంచరీతో పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్లు ఇమామ్-ఉల్-హక్(10), బాబర్ ఆజమ్(23) విఫలమయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన షకీల్(62) హాఫ్‌ సెంచరీ చేయగా.. కెప్టెన్ రిజ్వాన్(46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్య వేసిన 34వ ఓవర్‌లో రెండో బంతికి మహ్మద్ రిజ్వాన్ (46) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో షకీల్, రిజ్వాన్ 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

తర్వాత హార్దిక్ వేసిన 35 ఓవర్లలో 5వ బంతికి సౌద్ షకీల్ (62; 76 బంతుల్లో) అక్షర్ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్థాన్ 159 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. తర్వాత ఖుష్‌దిల్ షా (38) రాణించగా.. తయ్యబ్ తాహిర్ (4), సల్మాన్ అఘా (19), షహీన్ షా అఫ్రిది (0), నసీమ్ షా (14) విఫలమయ్యారు. దీంతో పాకిస్థాన్ 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా..హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.

పాక్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ(20), శుభ్‌మన్ గిల్(46) పరుగులు చేశారు. షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత అబ్రార్ అహ్మద్ వేసిన 17.3 ఓవర్‌కు శుభ్‌మన్ గిల్ (46) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(100) సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(56) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఖుల్‌దిష్‌ షా వేసిన 38.5 ఓవర్‌కు శ్రేయస్ అయ్యర్ (56) ఔటయ్యాడు. తర్వాత షహీన్ షా అఫ్రిది వేసిన 40 ఓవర్‌లో చివరి బంతికి హార్దిక్ పాండ్య (8) రిజ్వాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. చివరిలో 42.3 ఓవర్‌కు ఫోర్ బాదిన కోహ్లీ.. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ బౌండరీతో భారత్ విజయం కూడా సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అహ్మద్‌, ఖుష్‌దిల్‌ చెరో వికెట్‌ తీశారు.