Nikki Haley Comments: నిక్కీహెలీ కామెంట్లపై భగ్గుమంటున్న నెటిజన్లు
గత ఏడాది అక్టోబర్ 7 తెల్లవారుఝామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడి సుమారు 1,200 మంది చంపి ... 250 మంది ఇజ్రాయెల్ పౌరులను తమ వెంట తీసుకువెళ్లారు. అటు నుంచి ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకారదాడులకు పాల్పడుతోంది
Nikki Haley Comments: గత ఏడాది అక్టోబర్ 7 తెల్లవారుఝామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడి సుమారు 1,200 మంది చంపి … 250 మంది ఇజ్రాయెల్ పౌరులను తమ వెంట తీసుకువెళ్లారు. అటు నుంచి ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకారదాడులకు పాల్పడుతోంది. గాజాను నేలమట్టం చేసింది. ఇప్పటి వరకు సుమారు 36వేల మంది మృత్యువాతపడ్డారు. వారిలో మహిళలు, పసిపిల్లలే అధికం. గాజా మొత్తం నేలమట్టం కావడంతో ప్రజలు తమ ఇళ్లను వదిలేసి ఐక్యరాజ్య సమితి నిర్మించిన తాత్కాలిక గుడారాల్లో అత్యంత దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. యావత్ ప్రపంచం ఇజ్రాయెల్‌ను ఇక యుద్ధం ఆపండి అని వేడుకున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచం దేశాల సరసన తాము ఒంటరైనా ఫర్వాలేదు.. హమాస్‌ను మాత్రం కూకటి వ్రేళ్లతో పేకిలించే వరకు విశ్రమించబోమని శపథం చేస్తోంది ఇజ్రాయెల్.
ఫినిష్ దెమ్..(Nikki Haley Comments)
అయితే తాజాగా అమెరికన్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హెలీ.. గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేశారు. ఆమె చేసిన కామెంట్లకు యావత్ ప్రపంచం ఆమె విమర్శలు గుప్పించింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య విషయానికి వస్తే ఇటీవల ఆమె ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇజ్రాయెల్ ఆర్టిలరీ ముందు నిలుచొని ‘ఫినిష్ దెమ్” అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే యుద్ధం మొదలై ఎనిమిది నెలల దాటిపోయింది. వేలాది మంది మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా నిక్కీ చేసిన వ్యాఖ్యాలకు సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లెబనాన్ మూల్యం చెల్లించాలి..
గత మంగళవారం నిక్కీ హేలీ ఇజ్రాయెలీ రాజకీయ నాయకుడు యూఎన్ మాజీ రాయబారితో కలిసి గతవారాంతంలో ఇజ్రాయెల్ సరిహద్దులోని లెబెనాన్ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే హెలీ ఓ మేసేజ్‌లో ఫినిష్ దెమ్..అమెరికన్ ఇజ్రాయెల్, అల్వేస్.. వారిని అంతం చేయండి. ఎల్లప్పుడు మీ వెంట అమెరికన్ ఇజ్రాయెలీలు ఉంటారని సంతకం చేసిన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాజా, హమాస్ పని అయిపోయింది. ఇక లెబెనాన్ అంతు చూడాల్సింది ఉందని ఒక ఇంటర్వ్యూలో హెలీ వ్యాఖ్యానించారు. గాజాతో చూస్తోంది నిజమైన యుద్ధం. ఇక ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ లెబనాన్‌తో రోజు యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. లెబనాన్‌పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇజ్రాయెల్‌పై లెబెనాన్ దాడి చేసి తేలికగా తప్పించుకుందామనుకుంటోదేమో.. దానికి వారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనా నిక్కీ హెలీ హెచ్చరించారు.
ఇజ్రాయెల్ ఉత్తరాన లెబనాన్ సరిహద్దులో నివాసం ఉంటున్న 60వేల మంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. సరిహద్దు నుంచి రాకెట్లు దూసుకురావడంతో ఇప్పటి వరకు 24 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు వారిలో 10 మంది పౌరులు 14 మంది సైనికులు ఉన్నారని ఆమె అన్నారు. అదే విధంగా లెబనాన్ వైపు సుమారు 94వేల మంది నిరాశ్రయులయ్యారని యూఎన్ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి 300 మంది హెజబుల్లా పైటర్స్తో పాటు 83 లెబనీస్ పౌరులు మృత్యువాతపడ్డారు.
తాజాగా గాజా నగరంలోని దక్షిణ ప్రాంతం రఫాలో నివాసం కోల్పోయి టెంట్లలో ఉంటున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సుమారు 45 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అలాగే వరల్డ్కోర్టు కూడా గత వారం రఫాపై మిలిటరీ యాక్షన్ వెంటనే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. కాగా నిక్కీ హెలీ తాజాగా రఫాపై ఇజ్రాయెల్ దాడులను సమర్థించడం.. ఫినిష్ దెమ్ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.