BMTC Bus: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. షాక్ ఇచ్చిన ప్రయాణికుడు
BMTC Bus: సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ సరిపడా చిల్లర అని అడుగుతాడు. చిల్లర అందుబాటులో లేకపోతే టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమన చెబుతాడు. కానీ , మనం బస్సు దిగే హడావిడిలో చాలాసార్లు ఆ చిల్లర తీసుకోకుండానే వెళ్తాము.
కొంతమంది అయితే గుర్తుపెట్టుకుని కండెక్టర్ ని అడిగి రావాల్సిన చిల్లర తీసుకుని వెళ్తాడు.
అదే విధంగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా తనకు రావాల్సిన ఒక్క రూపాయిని వదిలిపెట్టలేదు. చిల్లర ఇవ్వలేదని కండక్టర్ పై వినియోగదారుల కోర్టుకు వెళ్లాడు.
అసలేం జరిగిందంటే..(BMTC Bus)
జరిగిన విషయం ఏంటంటే.. కర్ణాటక కు చెందిన రమేశ్ నాయక్ 2019 లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు లో శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు.
అప్పుడు టికెట్ ధర రూ. 29 కాగా, రమేశ్ రూ. 30 లు ఇచ్చాడు. మిగిలిన ఒక్క రూపాయి చిల్లర కోసం కండక్టర్ ను అడగ్గా..
అందుకు కండక్టర్ రమేశ్ పై కోపం తెచ్చుకుని చిల్లర లేదని గట్టిగా అరిచాడు. అయితే, కండక్టర్ ప్రవర్తన తో విసికి పోయిన రమేశ్ బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
వాళ్లు కూడా పట్టించుకోకుండా.. ఒక్క రూపాయి కోసమా అని నిర్లక్ష్యం చేశారు. అధికారుల తీరు చూసిన రమేశ్ స్థానికి వినియోగదారుల కోర్టుకు ఆశ్రయించి… పరిహారం ఇప్పించాలని కోరాడు.
సదరు ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. రమేశ్ కు రూ. 2 వేలు పరిహారంగా ఇవ్వాలని బీఎంటీసీని ఆదేశించింది.
వినియోగదారుడి కోర్టు ఖర్చులకు మరో రూ.1000 అదనంగా చెల్లించాలని చెప్పింది.
45 రోజుల లోపు పరిహారం అందజేయాలని బీఎంటీసీని ఆదేశించింది. ఒక వేళ చెప్పిన తేదీ లోపల పరిహారం ఇవ్వకపోతే రూ. 6 వేల వడ్డీ కింద ఇవ్వాలని హెచ్చరించింది.
బీఎంటీసీ కౌంటర్.. కోర్టు ఫైర్
అయితే, ఈ విషయంపై బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. సాధారణంగా బస్సులో రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని.. సేవల్లో ఎలాంటి అంతరాయం లేదని పిటిషన్ లో పేర్కొంది.
అదే విధంగా రమేశ్ వేసిన పిటిషన్ ను కొట్టి వేయాలని కోరింది. అయితే కోర్టు మాత్రం బీఎంటీసీ వాదననున తోసిపుచ్చింది.
ఇది ఒక్క రూపాయి చిల్లర గురించి కాదని.. వినియోగ దారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది.
ప్రయాణికుడుతో కండక్టర్ ప్రవర్తించిన తీరును కోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో మాత్రం పరిహారం తేల్చి చెప్పింది.