Published On:

Pregnant Woman Dies: రూ.10 లక్షలు చెల్లించకపోవడంతో వైద్యానికి నిరాకరణ.. పూణెలో నిండు గర్భిణి మృతి

Pregnant Woman Dies: రూ.10 లక్షలు చెల్లించకపోవడంతో వైద్యానికి నిరాకరణ.. పూణెలో నిండు గర్భిణి మృతి

7 months old pregnant women died due to hospital denied treatment for lack of money: రూ.10 లక్షలు చెల్లించకపోవడంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు విడిచింది. చికిత్సకు ముందే డబ్బులు చెల్లించాలని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి సిబ్బంది డిమాండ్‌ చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో వైద్యానికి నిరాకరించారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆమె మృతిచెందింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖేకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న సుశాంత్ భార్య తనిషా 7 నెలల గర్భిణి. గర్భంలో కవల పిల్లలు ఉన్న ఆమె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడింది. దీంతో పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తరలించారు.

 

రూ.10లక్షలు డిమాండ్..
గర్భిణి తనిషాకు వైద్యం అందించేందుకు రూ.10 లక్షలు ఆసుపత్రి సిబ్బంది డిమాండ్‌ చేశారు. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని తేల్చి చెప్పారు. ముందుగా రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఆమె భర్త సుశాంత్‌ చెప్పినప్పటికీ వైద్యానికి సిబ్బంది నిరాకరించారు. ఒకేసారి రూ.10 లక్షలు చెల్లించలేక తనిషాను మరో ఆసుపత్రికి తరలించారు. చికిత్సలో జాప్యం వల్ల డెలివరీ కాంప్లికేషన్స్‌తో ఆమె మృతిచెందింది.

 

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే..
తన భార్య తనిషా మృతికి దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రి సిబ్బంది కారణమని భర్త సుశాంత్‌ ఆరోపించారు. జీవితం కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారని, సకాలంలో వైద్యం అందిస్తే తన భార్య బతికి ఉండేదని వాపోయాడు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కోసం మెడికల్‌ కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు.

 

విచారణ జరిపిస్తాం..
ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖే ఈ ఘటనపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం అసంపూర్తిగా ఉందని, తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రి పీఆర్వో ఆరోపించారు. అంతర్గతంగా విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులకు అన్నివివరాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: