Tejashwi Yadav: మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు

RJD leader Tejashwi Yadav On PM Modi : బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచార వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రధాని మోదీ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ఇప్పటి వరకు బిహార్‌లో తన ప్రచారానికి రూ.20వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ బిహార్‌లో దాదాపు 200 బహిరంగ సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ఒక్కో సభకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బహిరంగ సభల కోసం రూ.20వేల కోట్లు వినియోగించారని విమర్శలు చేశారు.
బీజేపీకి వరం..
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరిస్థితి బీజేపీకి వరంగా మారిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ టికెట్లు కూడా అమిత్ షానే కేటాయిస్తారని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్, ఎన్డీఏ, ఆర్జేడీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నితీశ్ కుమార్ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.400 పింఛన్ బదులు రూ.1,100 అమల్లోకి తీసుకురానున్నారు.