PM Narendra Modi : ఈ నెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. ప్రధాని కార్యాలయం ప్రకటన!
PM Modi to visit three state on June 20 and 21 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20, 21 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఏపీలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బీహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాని హాజరవుతున్నారు.
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మోదీ నేతృత్వం వహించనున్నారు. 21న ఉదయం 6.30గంటలకు యోగా అనంతరం మోదీ మాట్లాడనున్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో నిర్వహించే యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
దేశవ్యాప్తంగా 3.5లక్షలకు పైగా ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోందని పేర్కొంది. ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’ ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 2015లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ఢిల్లీ, ఛండీఘడ్, లక్నో, మైసూరు, న్యూయార్క్, శ్రీనగర్ తదితర ప్రదేశాల్లో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారని ప్రధాని కార్యాలయం తెలిపింది.