Droupadi Murmu : వేదికపై కంటతడి పెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదికపై భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు గీతాలు ఆలపించారు. ఈ క్రమంలో ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్‌లో మూడురోజుల పర్యటనకు వెళ్లిన ఆమె డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలు ఎంతో అందంగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. కన్నీళ్లు ఆగలేదని, పిల్లలు చాలా చక్కగా పాడారని కొనియాడారు. ఇది వారి హృదయం లోతుల్లోంచి వచ్చిన పాట అని మెచ్చుకున్నారు.
పుట్టుకతోనే వైకల్యంతో పుట్టిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆమె తెలిపారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు తీసుకువెళ్తే ఒకనాటికి కచ్చితంగా సక్సెస్ అవుతారన్నారు. వైకల్యంతో ఉన్న పిల్లల సాధికారత, సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం పథకాల రూపకల్పన జరుగుతోందన్నారు. వైకల్యంతో పుట్టిన పిల్లల సాధికారత కోసం పని చేస్తున్న ఎన్‌ఐఈపీవీడీని అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (రిటైర్డ్), సీఎం పుష్కర్ సింగ్ థామి పాల్గొన్నారు.
President #DroupadiMurmu gets emotional as students of the National Institute for the Empowerment of Persons with Visual Disabilities, Dehradun, sing a heartfelt birthday song for her. pic.twitter.com/Ls2nY7UR5E
— All India Radio News (@airnewsalerts) June 20, 2025