Pension : బిహార్ సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు పెన్షన్ పెంపు

Bihar CM Nitish Kumar: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పింఛన్ సొమ్మును పెంచారు. ప్రస్తుతం అక్కడ రూ.400 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు ట్రిపుల్ చేసి రూ.1,100లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
జులై 1 నుంచి అమలు..
జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుందని పేర్కొన్నారు. దీంతో కోటి మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందనున్నట్లు చెప్పారు. సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలందరికీ రూ.400 పింఛన్ బదులు రూ.1,100 తమ ప్రభుత్వం అందించనుందని పేర్కొన్నారు. విషయం మీకు తెలియజేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జులై 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామన్నారు. జులై 10 తేదీ వరకు అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
వృద్ధులు సమాజంలో గౌరవంగా బతికేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆ దిశగా కృషి చేస్తున్నామని నితీశ్ ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు. ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్, ఎన్డీఏ, ఆర్జేడీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నితీశ్ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు.