Published On:

Rahul Gandhi : మేకిన్‌ ఇండియాపై రాహుల్‌ గాంధీ సెటైర్లు

Rahul Gandhi : మేకిన్‌ ఇండియాపై రాహుల్‌ గాంధీ సెటైర్లు

Rahul Gandhi satire on Makein India : ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం చేపట్టిన మేకిన్‌ ఇండియా కార్యక్రమం పూర్తిగా విఫలమైందని లోక్‌సభలో పతిపక్ష నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. మేకిన్‌ ఇండియాతో మనకు అతుకులు మాత్రమే మిగులుతున్నాయని విమర్శించారు. కార్యక్రమం వల్ల మనకంటే ఎక్కువగా చైనా లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు. దేశంలో తయారీ రంగం తగ్గుతుండడంతో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు.

 

కేంద్రంపై విమర్శలు..
ఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌ ‘నెహ్రూ ప్లేస్‌’లో ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించారు. అక్కడ పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లతో ఆయన ముచ్చటించారు. అందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేకిన్‌ ఇండియాతో ఫ్యాక్టరీ రంగం అమాంతం పెరుగుతుందని కేంద్రం చెప్పిందని తెలిపారు. మరి ఎందుకు తయారీ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది? అని ప్రశ్నించారు. యువత నిరుద్యోగ రేటు ఎందుకు భారీగా పెరిగింది? చైనా నుంచి దిగుమతులు ఎందుకు రెండు రెట్లు పెరిగాయి? అని ప్రశ్నించారు.

 

మోదీజీ నినాదాలు చెప్పడంలో మాస్టర్‌..
ప్రధాని మోదీజీ నినాదాలు చెప్పడంలో మాస్టర్‌ అని దుయ్యబట్టారు. పరిష్కారాలు చూపడంలో కాదని, 2014 నుంచి తయారీ రంగం మన ఆర్థిక వ్యవస్థలో 14 శాతానికి పడిపోయిందని ఆరోపించారు. నిజం నిక్కచ్చిగా ఉంటుందన్నారు. మనం వస్తువులను అసెంబ్లింగ్‌ చేస్తున్నామని, దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కానీ, వాటిని తయారుచేయటం లేదన్నారు. వాటిని తయారుచేస్తున్న చైనా లాభపడుతోందని విమర్శించారు.

 

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను నెమ్మదినెమ్మదిగా వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తయారీ రంగంలో సంస్కరణలు అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఇతరులకు మనం మార్కెట్‌గా ఉండకూడదని, ఇక్కడే ఉత్పత్తి చేస్తే, ఇక్కడే కొనుగోళ్లు చేస్తామన్నారు. సమయం లేదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: