Operation Sindhu : కొన్ని గంటల్లోనే స్వదేశానికి 1000 మంది విద్యార్థులు

Students from Iran to India : ఇజ్రాయెల్-ఇరాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఇటీవల తన గగనతలాన్ని మూసివేసింది. కాగా, భారత్ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన దాదాపు వెయ్యి మంది భారతీయులు కొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి రానున్నారు.
ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్‌లోని పలు నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. తొలి విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకోనుంది. మరో రెండు విమానాలు శనివారం దిగనున్నట్లు సమాచారం. దీనికి ముందు ఇరాన్ నుంచి ఇప్పటికే 110 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నప్పటికీ వీరు తొలుత ఆర్మేనియా.. అక్కడ నుంచి భారత్‌కు వచ్చారు.
వారం కింద ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడులతో ఇరాన్‌లోని అనేక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్‌లతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలోనే తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా భారతీయ విద్యార్థులను తరలించేందుకు ఇరాన్ ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చింది. దీంతో విద్యార్థుల తరలింపు ప్రక్రియ సులభం కానుంది. ఇరాన్‌లో దాదాపు నాలుగు వేల మంది భారతీయులు ఉండగా, అందులో రెండు వేల మంది విద్యార్థులేనని సమాచారం.