Published On:

Operation Sindhu: ఆపరేషన్‌ సింధు.. భారత్‌కు 290 మంది భారతీయులు

Operation Sindhu: ఆపరేషన్‌ సింధు.. భారత్‌కు 290 మంది భారతీయులు

Iran-Israel War: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌ సింధు’ చేపట్టి భారతీయులను ఇరాన్‌ నుంచి తరలిస్తున్నది. ఇప్పటి వరకు 517 మంది భారత పౌరులను సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. విద్యార్థులతో పాటు ఇతర పౌరులు ఉన్నారని పేర్కొంది.

 

శుక్రవారం రాత్రి 11.30కి ఇరాన్‌ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరిందని విదేశాంగశాఖ ప్రతినిధి రణదీర్‌ జైస్వాల్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. పెద్దసంఖ్యలో విద్యార్థులతోపాటు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన వారు, మహిళలు ఉన్నారు. వారికి విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి అరుణ్‌ ఛటర్జీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్‌ సింధుకు సహకారం అందించారని, ఈ కార్యక్రమంలో కొనసాగుతుందని పేర్కొన్నారు.

 

శనివారం ఉదయం తుర్కెమేనిస్థాన్‌ రాజధాని అష్గాబాత్ నుంచి మరొక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఆపరేషన్ సింధు కింద స్వదేశానికి తిరిగి వచ్చిన మొత్తం పౌరుల సంఖ్య 517కి చేరుకుంది. అవసరాన్ని బట్టి ఆపరేషన్ కొనసాగుతుందని, ఇరాన్‌లో చిక్కుకున్న ప్రతి పౌరుడికి సాయం అందించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

గురువారం తొలిదశలో 110 మంది పౌరులతో కూడిన విమానం భారత్‌కు చేరుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుందని, పౌరుల భద్రతకు పెద్దపీట వేసి భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్‌ సింధు’ మిషన్‌ చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాన్‌ నుంచి పౌరులను తరలించడం సవాల్‌తో కూడుకున్న పని అన్నారు. దీన్ని కేంద్రం సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి: