Published On:

Sonia Gandhi : ఇజ్రాయెల్, ఇరాన్‌ సంఘర్షణపై కేంద్రప్రభుత్వం మౌనం తగదు : సోనియా గాంధీ

Sonia Gandhi : ఇజ్రాయెల్, ఇరాన్‌ సంఘర్షణపై కేంద్రప్రభుత్వం మౌనం తగదు : సోనియా గాంధీ

Iran-Israel War: ఇజ్రాయెల్-ఇరాన్‌ రెండుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. యుద్ధంపై భారత్ మౌనం వహించడాన్నితప్పుబట్టారు. ఈ విషయంలో కేంద్రం మౌనం దౌత్య వైఫల్యంలా కన్పిస్తోందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. టెహ్రాన్‌పై, టెల్‌ అవీవ్‌ చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమని, ఈ సందర్భంగా సార్వభౌమాధికార ఉల్లంఘనగా ఆమె అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న దాడులతో ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు. ఘర్షణలు అస్థిరతను తీవ్రతరం చేయడం వల్ల మరిన్ని సంఘర్షణలకు బీజాలు వేస్తాయన్నారు.

 

ఇరాన్‌, అమెరికాల దేశాల మధ్య అణు చర్చలకు మార్గం సుగమం అవుతున్న వేళ.. టెల్‌ అవీవ్‌ టెహ్రాన్‌లోని అణుస్థావరాలపై దాడులకు దిగడం సరైన చర్య కాదని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు. మరోవైపు ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణహోమంలో గాజాలో 55,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం గాజా కరవు అంచున ఉండడంతో అక్కడ మిగిలి ఉన్న ప్రజలు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గాజాలో జరిగిన విధ్వంసం మళ్లీ ఇరాన్‌లో పునరావృతం అవకుండా ఆలస్యం అవ్వకముందే భారత్‌ కల్పించుకోవాలన్నారు.

 

భారత్‌కు ఇరాన్‌-ఇజ్రాయెల్‌లతో దీర్ఘకాలిక దౌత్య సంబంధాలు ఉన్నాయన్నారు. ఇటీవల న్యూఢిల్లీ, టెల్‌అవీవ్‌ మధ్య రక్షణ, వాణిజ్యం, నిఘా సహకారాన్ని విస్తరించినా టెహ్రాన్‌తో లోతైన చారిత్రక, నాగరిక, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, యుద్ధ నివారణ విషయంలో రెండుదేశాల చర్చలు జరపడానికి భారత్‌ తనవంతు చర్యలు తీసుకోవాలని సోనియా గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 

ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంలో శుక్రవారం ఇరాన్ దౌత్యవేత్త మొహమ్మద్ జావాద్ హొస్సేనీ మాట్లాడారు. తమపై ఇజ్రాయెల్‌ చేపడుతున్న దురాక్రమణను బహిరంగంగా ఖండించాలని భారత్‌ సహా ప్రపంచ దేశాలను కోరారు. ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని, తమ దేశంలోని కీలక ప్రాంతాలను ధ్వంసం చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోనియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి: