PM Modi : ఎన్డీయే హయాంలోనే బిహార్ అభివృద్ధి : ప్రధాని మోదీ

Prime Minister Modi visit Bihar : బిహార్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాని శుక్రవారం బిహార్‌లో మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై నిప్పులు చెరిగారు. బిహార్‌ను ‘లైసెన్స్ రాజ్’ సుదీర్ఘ కాలం పేదరికంలో ఉంచిందని దుయ్యబట్టారు. ఇందులో దళితులే అతిపెద్ద బాధితులుగా మారారని ఆరోపించారు. బిహార్‌లోని సివాన్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఎన్డీయే హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు.
బిహార్‌ను ఎన్డీయే అభివృద్ధి చేస్తుందనడానికి మర్హౌరా రైలు ఫ్యాక్టరీ ఓ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆఫ్రికాలో కూడా బిహార్‌కు ప్రశంసలు వస్తాయని కొనియాడారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు పట్టించుకోని సరన్ జిల్లాలో రైల్వే ప్రాజెక్టు కొనసాగుతోందన్నారు. తయారీ, ఎగుమతుల్లో సరన్ ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకుందన్నారు. బిహార్ అభివృద్ధిని సుదీర్ఘకాలంగా ‘జంగిల్ రాజ్’ అడ్డుకుందని ఆరోపించారు. ఇప్పుడు బిహార్‌లో తయారైన ఇంజిన్ ఆఫ్రికన్ రైలుకు శక్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అని తమ ప్రభుత్వం చెబుతుందని, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మాత్రం ‘పరివార్ కా సాత్’ అంటూ కుటుంబ శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణమన్నారు. నేతల కుటుంబీకులు ధనవంతులు అయ్యారని, సామాన్యులు మాత్రం పేదలుగానే మిగిలి పోయారన్నారు. రానున్న రోజుల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ప్రజాసేవ చేయకుంటే తాను ప్రశాంతంగా నిద్రపోలేనని, రాత్రి-పగలు ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.