FIFA World Cup: లియోనల్ మెస్సీ మ్యాజిక్.. అరుదైన రికార్డ్ సాధించిన “గోట్”.. ఫిఫా ప్రపంచకప్ దిశగా అర్జెంటీనా పయనం..!
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 టోర్నీలో క్రొయేషియా, అర్జెంటీనాకు మధ్య జరిగిన మ్యాచ్ లో మెస్సీ సేన విజయం సాధించింది. ఈ విజయంతో అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు మెస్సీ ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు.
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 టోర్నీలోని మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. గత రాత్రి క్రొయేషియా, అర్జెంటీనాకు మధ్య జరిగిన మ్యాచ్ లో మెస్సీ సేన మాయ చేసిందనే చెప్పవచ్చు. పెనాల్టీ కిక్ ను గోల్ కొట్టి తన జట్టుకు మెస్సీ అద్భుత విజయాన్ని అందిచాడు. దానితో అర్జెంటీనా జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం అర్ధరాతి 12.30 గంటలకు ప్రారంభమైన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను చిత్తు చేసింది. ఈ విజయంతో అర్జెంటీనా 2014 తర్వాత మరోసారి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
మెస్సీ మ్యాజిక్.. అతడే నెంబర్ వన్
సాకర్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ప్రపంచకప్ గెలవాలన్న చిరకాల కల నెరవేర్చుకునే దిశగా దూసుకెళ్తున్నాడు. స్టార్ ఆడగాడిగా ఉన్నాకానీ తన కెరీర్‌లో ఇంతవరకు ఆయన ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేదు. ఇక ఈ విజయంతో అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు మెస్సీ ఒక్క అడుగుదూరంలో నిలుచుని ఉన్నాడు. క్రొయేషియాతో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కిక్‌కు గోల్‌గా మలిచిన మెస్సీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు మెస్సీకి ఇది ఐదో గోల్. మొత్తంగా ఈ మెగా ఈవెంట్‌లో ఈయన 11 గోల్స్ వేశారు. తద్వారా అర్జెంటీనా తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కాడు. అంతే కాకుండా ఈ రికార్డుతో మరో ఫీట్‌ను కూడా నమోదు చేశాడు. ఒక వరల్డ్‌కప్ టోర్నీలో 5 గోల్స్ సాధించిన అత్యధిక వయస్కుడిగా నిలిచాడు 35 ఏళ్ల మెస్సీ. దిగ్గజ ఫుట్‌బాలర్ డిగో మారడోనా సహా గాబ్రియెల్ బటిస్టుటా, గిల్మెరో స్టబిలేను దాటుకుని మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు.
Argentina storm through to the #FIFAWorldCup Final 🇦🇷 🔥 #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్లు
లియోనల్ మెస్సీ- 11(25 మ్యాచ్‌లు)
గాబ్రియెల్ బటిస్టుటా- 10(12 మ్యాచ్‌లు)
గిల్మెరో స్టబిలే- 8 (4 మ్యాచ్‌లు)
డిగో మారడోనా- 8 (21 మ్యాచ్‌లు)
మారియో కెంప్స్- 6 (18 మ్యాచ్‌లు)
ఇకపోతే ఈ టోర్నీ మెస్సీకి సీనియర్ ఫుట్‌బాల్‌లో 1,002వ గేమ్, అతని 791వ గోల్ మరియు 340వ అసిస్ట్. అతను బార్సిలోనాతో 35 ట్రోఫీలను, ప్రస్తుత క్లబ్ పారిస్ సెయింట్-జర్మైన్‌తో గత సీజన్‌లో ఫ్రెంచ్ టైటిల్‌ను మరియు అర్జెంటీనాతో 2021 కోపా అమెరికాను గెలుచుకున్నాడు.
GOAT అంటే ఏంటి? మెస్సీ ఫుట్‌బాల్ GOAT ఎందుకు అవుతాడు?
GOAT-Greatest Off All Timeను సింపుల్‌గా గోట్ అని పులుస్తుంటారు అభిమానులు. ట్విటర్‌లో అయితే గోట్‌కు గుర్తుగా గొర్రె సింబల్‌ను పెట్టి ట్రెండ్ చేస్తుంటారు. ఇక మెస్సీని ఉద్దేశించి మాజీ ఇంగ్లండ్ డిఫెండర్ జామీ కరాగెర్ తన లుసైల్ మాస్టర్ క్లాస్ తర్వాత మెస్సీ “ఎప్పటికైనా అత్యుత్తమం” అని ట్వీట్ చేశాడు.
#Messi𓃵 the best there has ever been!
— Jamie Carragher (@Carra23) December 13, 2022
అంబరాన్నంటిన అర్జెంటీనా సంబురాలు
అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో ఆ దేశ ప్రజల సంబరాలు అంబరాన్నంటాయి. రాజధాని బ్యూనో ఎయిర్స్ వీధులు మొత్తం జనసంద్రంతో నిండిపోయాయి. వేలాది మంది అర్జెంటీనా ప్రజలు తమ జాతీయత ప్రతిబింబించేలా లేత నీలం, తెలుపు రంగుల కలయికతో ఉన్న జెండాలు ప్రదర్శిస్తూ ఆనందంతో గంతులు వేశారు. మెస్సీ బృందం అందుకున్న చిరస్మరణీయి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కేరింతలు కొట్టారు.
అంతేకాదు 35 ఏళ్ల మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్ టోర్నీ కానుందన్న తరుణంలో అర్జెంటీనా ఫైనల్ చేరడం సంతోషాలను రెట్టింపు చేసింది. ఇక రెండో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్- మొరాకో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్లో అర్జెంటీనా తలపడనుంది. మరి ఈ సారైనా మెస్సీసేన ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంటుందా.. ప్రపంచ కప్ కొట్టి మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా అనేది వేచి చూడాలి..!
ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎస్సై.. ఆధారాలు లేకుండా నోట్ల కట్టలు నోట్లో కుక్కుకుని..!