Sunil Chhetri: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న ఛత్రీ.. మళ్లీ జట్టులోకి భారత స్టార్ ఫుట్ బాలర్

Sunil Chhetri Makes Retirement U-Turn: భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛత్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, తాను ప్రకటించిన రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్‌ను మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని భారత ఫుట్ బాల్ సమాఖ్య ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో సునీల్ ఛత్రీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
‘సునీల్ ఛత్రీ మళ్లీ వెనక్కి వచ్చాడు. కెప్టెన్, నాయకుడు, లెజెండ్.. మార్చిలో జరగనున్న ఫిఫా అంతర్జాతీయ విండో కోసం భారత జాతీయ జట్టుకు తిరిగి వస్తాడు.’ అని ఏఐఎఫ్ఎస్ ట్వీట్ చేసింది. కాగా, మార్చి 25వ తేదీన బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏఎఫ్‌సీ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్ మూడో రౌండ్‌లో సునీల్ ఛత్రీ ఆడనున్నాడు.
కాగా, షిల్లాంగ్‌లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్ దేశాలు ఒకే గ్రూపులో ఉన్నాయి. అయితే, గత ఏసియన్ కప్‌లో భారత్.. అన్ని మ్యాచ్‌లు ఓడింది.
ఇదెలా ఉండగా, సునీల్ ఛత్రీ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో లెజెండ్ సరసన ఛత్రీ ఉన్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనా మెస్సీ, అలీ దాయి ఉండగా.. తర్వాతి స్థానంలో సునీల్ ఛత్రీ ఉన్నాడు. అతను 2007, 2009, 2012లలో నెహ్రూ కప్ అందుకోవడంలో సునీల్ ఛత్రీ కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా సాఫ్ ఛాంపియన్స్ షిప్‌ను కూడా తన నాయకత్వంలో అందుకున్నాడు.
2005లో ఎంట్రీ ఇవ్వగా.. పాకిస్థాన్‌పై తొలి గోల్ కొట్టాడు. చివరి మ్యాచ్ వరకు ఛత్రీ 252 గోల్స్ సాధించాడు. అయితే గతేడాది కువైట్‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో భారత్.. గోల్ చేయకుండా డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సునీల్ ఛత్రీ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా, మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.