Last Updated:

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం.. మంచుల్లో 57 మంది కార్మికులు

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం.. మంచుల్లో 57 మంది కార్మికులు

57 Workers Feared Trapped In Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం కింద కనీసం 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.  గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తుంది. అయితే ఇవాళ ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన బద్రీనాథ్ ధామ్‌లోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

బద్రీనాథ్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామ సమీపంలోని ఆర్మీ క్యాంప్ వద్దకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 57 మంది కార్మికులు ఉన్నట్లు ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దీపమ్ సేథ్ వివరించారు.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ ఆఫరేషన్ చేపట్టినట్లు తెలిపారు. రెండు గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు బలమైన గాలులతో మంచు కురవడంతో రోడ్లు పూర్తిగా మూసుకుపోయాయని వివరించారు. ఇప్పటికే ఆ ప్రాంతాల వద్దకు మూడు నుంచి నాలుగు అంబులెన్స్ సైతం పంపినట్లు తెలిపారు.

చమోలి-బద్రీనాథ్ జాతియ రహదారిపై గ్లేసియర్ పేలింది. ఈ సమయంలో కార్మికులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. మంచు ఒక్కసారిగా విరిగి పడడంతో 57 మంది కార్మికులు మంచుల్లో కూరుకుపోయారు. ఇందులో 16 మందిని రక్షించగా.. 41 మంది ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం మిగతా 41 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. మంచుల్లో చిక్కుకున్న కార్మికులందరినీ రక్షిస్తామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మంచు చరియలు విరిగి పడిన ప్రాంతం భారత్- టిబెట్ సరిహద్దుకు ఆనుకొని సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది.