Last Updated:

PM Kisan: రైతులకు ప్రధాని గుడ్‌న్యూస్.. రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు జమ

PM Kisan: రైతులకు ప్రధాని గుడ్‌న్యూస్.. రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు జమ

PM Kisan 19th Installment Released pm modi: దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్. సోమవారం కేంద్రం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను విడుదల చేసింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ నిధులను విడుదల చేశారు. ఈ విడతలో దాదాపు 9.80 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున రూ.22 వేల కోట్లు బదిలీ చేశారు. 2019లో ప్రారంభం అయిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.

వారిని క్షమించరు..
కుంభమేళాను అపహాస్యం చేస్తూ మాట్లాడేవారిని బీహార్ ప్రజలు ఏనాటికీ క్షమించరని, వికృతమైన ఆలోచనలున్న వారు మాత్రమే సొంత సంస్కృతిని ద్వేషిస్తారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం భాగల్ పూర్ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో నిర్వహణ లోపం, తొక్కిసలాట, అపరిశుభ్రమైన నీటిపై ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సిల్క్ సిటీపై ప్రశంసలు..
కుంభమేళా సమయంలో మందరాచల్‌ను సందర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేల వారసత్వం, విశ్వాసమే దేశాభివృద్దికి కారణమని చెప్పారు. షాహీద్ తిల్కా మాఝి నివసించిన నేల అని, దీనినే సిల్క్ సిటీగానూ పిలుస్తారని మోదీ గుర్తుచేశారు. బీహార్‌లోని నితీశ్, బీజేపీ ప్రభుత్వం బీహార్‌లోని జంగల్ రాజ్‌ స్థానంలో అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నాయని మోదీ తెలిపారు.

లాలూపై విసుర్లు
జంగిల్ రాజ్‌ నడిపిన నేతలే.. నేడు కుంభమేళా మీద నోటికొచ్చింది మాట్లాడుతున్నారని పరోక్షంగా ఆర్జేడీపై మోదీ సెటైర్లు వేశారు. యూరోప్‌ జనాభా కంటే ఎక్కువ మంది మహా కుంభమేళాలోపుణ్య స్నానాలు చేశారని ప్రధాని గుర్తు చేశారు. కుంభమేళా ఐక్యతను సూచిస్తుందని చెప్పారు. రామ మందిరంపై చిరాకు పడిన నేతలే కుంభమేళానూ విమర్శిస్తున్నారని చెప్పారు. కాగా, గత వారం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుంభమేళాను అర్థం లేని వ్యవహారమని కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి: