MLC Kavitha Comments: నేను ఆర్నెల్లు జైల్లో ఉన్నది సరిపోలేదా?: కవిత కామెంట్స్

MLC Kavitha Comments on her Prison Period: కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. 16 నెలల్లో లక్షా 80 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. అయినా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదని, మహిళలకు తులం బంగారం ఇవ్వలేదని, పెన్షన్లు పెంచలేదని ఆరోపించారు.
లక్షా 80 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం 80 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. మిగిలిన లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారన్నారు. ఇందులో 20 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఖాతాకు వెళ్లిందని ఆరోపించారు. తన ఆరోపణలు తప్పని నిరూపించాలనుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి పరిపాలన చేతకాక రాష్ట్రంలోని విలువైన భూములను తాకట్టుపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. టీజీఐఐసీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని ఆరోపించారు.
పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేస్తున్నానని కవిత అన్నారు కవిత. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో ప్రజలనుంచి వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానన్నారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని కవిత స్పష్టం చేశారు.
పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందన్నారు. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయన్నారు. ఆర్నెల్లు జైల్లో ఉన్నదిసరిపోలేదా.. నన్ను ఇంకా కష్టపెడతారా అని కవిత అన్నారు. తనను రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు ఖండించక పోవడం దురదృష్టకరమన్నారు.